కోదాడ, ఏప్రిల్ 14 : సమాజాన్ని విచ్చిన్నం చేసేందుకు మతోన్మాద శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, ఆ శక్తులను నిలువరించేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి అలాగే ఉస్మానియా చేగువేరా జార్జి రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమానత్వం, సౌబ్రాతృత్వం, లౌకిక తత్వంతో పాటు కుల రహిత సమాజం కోసం కృషి చేసిన బీఆర్ అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా జార్జి రెడ్డి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించినట్లు తెలిపారు.
జీనా హై తో మర్నా సికో.. కదం కదం పర్ లడనాసికో అనే నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను చైతన్యపరిచిన మేధావి జార్జిరెడ్డి అని కొనియాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మతోన్మాదంతో దేశాన్ని కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేసేందుకు ప్రణాళికలు రచిస్తుందని, దాన్ని నిలువరించేందుకు యువత ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.. ఈ సమావేశంలో ప్రజా చైతన్య వేదిక బాధ్యులు పందిరి నాగిరెడ్డి, స్వామి, బడుగుల సైదులు, మస్తాన్, రామ నరసయ్య, భిక్షం, హరికిషన్ రావు, రాఘవరెడ్డి, అప్పిరెడ్డి, రాధాకృష్ణ, రవికిరణ్, నరసింహారావు, దుర్గాప్రసాద్, చంద్రబాబు, బాలునాయక్, బాబు పాల్గొన్నారు.