నల్లగొండ ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : అక్షర యోధుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు భాషకు తీరని లోటు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలుగు ప్రజలు గొప్ప మాతృ భాషా ప్రేమికుడిని కోల్పోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి శుక్రవారం రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహంపై పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాష పట్ల రామోజీరావుకు ఉన్న ప్రేమ, మమకారం, నిబద్ధతను జగదీశ్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన్య విజయాలు సాధించి అక్షర యోధుడిగా తెలుగు వెలుగు పేరుగాంచిన రామోజీరావు సేవలు ఎన్నటికీ మరువలేమని కొనియాడారు.
తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒక ఉపాధ్యాయ సంఘం సమావేశంలో తెలుగు భాష గురించి మాట్లాడిన మాటలను అభినందిస్తూ రామోజీరావు తనకు లేఖ రాయడాన్ని మర్చిపోలేనన్నారు. అవసరం కోసం ఆంగ్లం నేర్చుకున్నా.. అమ్మ భాషను మర్చిపోకూడదంటూ తాను చేసిన వ్యాఖ్యలు తనను లేఖ రాసేందుకు ప్రేరేపించాయంటూ రామోజీరావు పేర్కొనడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. తెలుగు భాషా వికాసానికి, మాతృ భాషా సముద్ధరణ దిశగా తమ లాంటి నేతల కార్యాచరణ ఉండాలంటూ రామోజీరావు చేసిన సూచన ఎప్పటికీ ఆచరణీయమని అన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.