గుర్రంపోడ్, నవంబర్ 10 : ప్రభుత్వం వివిధ చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వగా వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సైజు కాకుండా చిన్న పిల్లలను, చనిపోయిన వాటిని పంపిణీ చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చిన్న చేప పిల్లలు తమకొద్దని గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామంలో శనివారం మత్స్యకార సొసైటీ సభ్యులు వెనక్కి పంపించారు. మండలంలో మొత్తం 8 లక్షల చేప పిల్లలు పోయాల్సి ఉండగా ఇప్పటికి 5 లక్షలు పోసినట్లు కాంట్రాక్టర్లు లెక్కల్లో చూపించారు. చేపపిల్లలను కాంటా వేయకుండా తూతూ మంత్రంగా పోస్తున్నట్లు తెలుస్తుంది.
మత్స్యశాఖ అధికారుల కనుసన్నల్లోనే అంతా జరుగుతున్నదని సొసైటీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడించుల వరకు సైజ్ ఉన్న చేప పిల్లలను చెరువుల్లో పోయాల్సి ఉండగా, ఇంచున్నర నుంచి రెండించులు ఉన్న పిల్లలనే తీసుకొస్తున్నారని వారు చెబుతున్నారు. చెరువుల్లో వదిలిన అనంతరం మూడు ఇంచుల చేప పిల్లలు పోసినట్లు అధికారుల ద్వారా రికార్డుల్లో రాయించుకుంటున్నారని అంటున్నారు. కొన్ని చెరువుల వద్ద అధ్యక్షుడిని మేనేజ్ చేసి పోస్తుండగా, మరికొన్ని చోట్ల అధికారులతో కలిసి మాయ చేస్తున్నారు. దీనిపై మత్స్యశాఖ అభివృద్ధి అధికారి మారయ్యను ఫోన్లో సంప్రదించిగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.