త్రిపురారం, జూలై 18 : సాగర్ ఎడమ కాల్వకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతు సంఘం నల్లగొండ జిల్లా నాయకుడు కొప్పు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం త్రిపురారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు నార్లు పోసి, నీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయన్నారు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రైతులు వరి నాట్లు వేసుకునేలా చూడాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వస్తున్నా సాగర్ నుంచి రైతులకు నీరు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూలై చివరి వారం వరకు నీటిని విడుదల చేయకపోతే రైతులు పంటలు ఎలా వేసేదన్నారు.
ఎడమ కాల్వ పరిధిలోని లిఫ్టులను పట్టించుకోవడం లేదని, దీంతో లిఫ్టులు చాలా వరకు రిపేర్లు ఉన్నాయని, మోటార్లు, పంప్‌లు రిపేర్లు చేసి వాటి ద్వారా రైతులకు నీటిని అందించాలన్నారు. సకాలంలో వర్షాలు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నాగార్జునసాగర్ జలాశయంలో నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతుల గోడు వినిపించుకోవడం లేదన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నార్లు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. త్వరగా నీటిని అందించి రైతులను ఆదుకోకపోతే ధర్నాలు, దీక్షలు చేస్తామని ఆయన హెచ్చరించారు.