బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ కృష్ణా నదిలోని నీటిని పొదుపుగా వాడుకున్నది. పదేళ్ల పాలనలో ఏనాడూ కనిష్ఠ స్థాయికి చేరుకోలేదు. ప్రతి ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరు అందించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణానది నీటి వినియోగం గురించి అంతగా పట్టించుకోలేదు. పాలకులు.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి చేరుకున్నది. తాగు, సాగు నీటికి కష్టాలు వచ్చే అవకాశం ఉన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నందికొండ, మే 5 : నాగార్జునసాగర్ జలాశయంలోని నీటి మట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. దీంతో నీరు డెడ్ స్టోరేజ్‌కు (510 అడుగులు) చేరువలో ఉన్నది. గత ఏడాది ఆగస్టులో రిజర్వాయర్‌లోకి నీరు పుష్కలంగా చేరడంతో క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసి 4 నెలల పాటు 612 టీఎంసీల నీటిని దిగువకు వృథాగా విడుదల చేశారు. రిజర్వాయర్‌లో పుష్కలంగా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దీంతో రబీ సీజన్లో పంటలకు నీరు అందని పరిస్థితి వచ్చింది. సాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటి మట్టం 511.60 (134.4032 టీఎంసీలు) మేర నిల్వ ఉండగా డెడ్ స్టోరేజ్ (510 )కు కేవలం అడుగున్నర (2.7342 టీఎంసీలు)సమీపంలో మాత్రమే ఉంది.
కృష్ణా నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10 టీఎంసీలు, ఆంధ్రకు 4 టీఎంసీల నీటిని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ నీటి నిల్వలను నదిలో నీటిమట్టం 505 అడగుల వరకు వాడుకోవచ్చని నిర్ణయించింది. కృష్ణా నది డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా దాని కంటే ఇంకా 5 అడుగులు దిగువకు నీటిని వాడుకునేలా కేఆర్ఎంబీ నిర్ణయించింది.
తాగునీటి కోసం నీటిని వాడుకోవడం, సీజన్లో నదిలోకి సకాలంలో నీరు రాకపోతే ఈ ఏడాది ఎడమ కాల్వ దిగువన సాగు చేసే పంటల సాగు ప్రశ్నార్థ్ధకంగా మారే అవకాశం ఉంది. 510 కంటే నీటి మట్టం దిగువకు పోతే ఎడమ కాల్వకు తాగు, సాగుకు నీరు విడుదల చేయడానికి వీలు ఉండదు. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించి కృష్ణానదిలో నీటిని తాగునీటి అవసరాల సాకుతో ఆంధ్రకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని, కృష్ణానదిలో నీరు డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పోకుండా చూడాలని ఎడమ కాల్వ ఆయకట్టు రైతాంగం కోరుతున్నది.