నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి7(నమస్తే తెలంగాణ) : కుల గణన పేరుతో వెల్లడించిన వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని బహుజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జనాభా సైతం పెరుగాల్సి ఉండగా ప్రభుత్వ లెక్కల్లో తగ్గడంపై మండిపడుతున్నారు. జనాభాను తగ్గించి చూపడం అంటే బహుజనులను మోసం చేయడమే కాంగ్రెస్ ఏజెండా అంటూ భగ్గుమంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకునే దాకా హామీ పత్రాలు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోసాలకు తెరతీయడం తగదని హితువు పలుకుతున్నారు. అధికారం చేపట్టగానే రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లు తెస్తామని, వాటి ప్రకారం 42 శాతం కోటా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మడమ తిప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఏరు దాటాక ఓడ మల్లయ్య దాటాక బోడి మల్లయ్య చందంగా కాంగ్రెస్ నిర్వాకం ఉందని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రేవంత్రెడ్డి సర్కారు రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నదని, ఈ కుట్రను సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని, తమ పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తామని, మిగతా పార్టీలు కూడా ఇవ్వాలని ఆయన కోరడం పెద్ద మోసమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంత మోసకారి పార్టీనో ఈ ఒక విషయంలోనే తేటతేల్లం అవుతున్నదని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా కులగణన చేపట్టిందని, సర్వేను అసంపూర్తిగా చేసిందని ఆరోపిస్తున్నారు.
కేవలం బీసీలకు ద్రోహం చేసేందుకే తమ జనాభాను తగ్గించి చూపారని, ఓసీలకు మేలు చేసేందుకు వారి జనాభా పెరిగినట్లు చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం ఉన్న బీసీలు పదేండ్లల్లో పెరుగాలి గానీ, తగ్గడం అంటే కుట్ర జరిగిందనే అర్ధం చేసుకోవాలని పేర్కొటున్నారు. పదేండ్ల కింద 51 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు 46 శాతానికి ఎలా తగ్గుతారని నిలదీస్తున్నారు. బీసీ కుల గణన నివేదిక తమ ఉనికికి ప్రమాదకరంగా మారిందని, వెంటనే దీన్ని రద్దు చేసి రీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అన్ని కులాలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటున్నారు. ద్రోహం తలపెట్టిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి తీరుతామని ఉమ్మడి జిల్లా బహుజనులు శపథం చేస్తున్నారు.
కాంగ్రెస్ పతనం ఈ సర్వేతోనే ప్రారంభం
కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఈ కులగణన సర్వేతోనే ప్రారంభమైంది. కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏదో మంచి పని చేస్తుందని అనుకున్నాం. కానీ ఇంత మోసం చేస్తదని అనుకోలేదు. ఇది ముమ్మాటికీ బీసీ వ్యతిరేక ప్రభుత్వమే. పదేండ్లలో బీసీల సంఖ్య ఎక్కువ కావాలి కాని తగ్గడం ఏంటి?. ఇది వట్టి బోగస్ సర్వే. రిజర్వేషన్ల శాతం పెంపు బీసీల హక్కు.. కానీ ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. కాంగ్రెస్ పతనం ఈ సర్వేతోనే ప్రారంభం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.
– జెర్రిపోతుల రాములుగౌడ్, సింగిల్విండో మాజీ చైర్మన్, మాడ్గులపల్లి
బీసీలను ఎదుగనివ్వరా?
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అణచివేసేలా పాలన సాగిస్తున్నది. బీసీలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. కులగణన లెక్కలు చూస్తుంటే బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగనీయకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని అర్థమవుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన బుద్ధి చెప్తారు.
-బండి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, అడవిదేవులపల్లి
అగ్రకులాల జనాభాను పెంచి చూపించే కుట్ర
అగ్ర కులాల జనాభా లెక్కను ఎక్కువ చేసి, బీసీలను తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. బీసీ సబ్ కమిటీకి మంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ నేతృత్వం వహించాల్సి ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించడం బీసీల అణచివేతలో భాగంగా పరిగణిస్తున్నాం. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి కులగణన పేరుతో బీసీలను మోసగించారు. బీసీలు కులగణన సర్వేను ఆమోదించడం లేదు. కుల గణనపై ప్రభుత్వం పునః సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. బిహార్ తరహాలో రెండో సారి పారదర్శకంగా కులగణన చేయాలి. బీసీలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు.
-రాపోలు పరమేశ్, నల్లగొండ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నిడమనూరు
కుల గణన సర్వే బోగస్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే రిపోర్ట్ అంతా బోగస్. పదేండ్లలో 21 లక్షల మంది బీసీలు చనిపోయారట. ఒక్క బీసీ పుట్ట లేదట. లక్షా డబ్బు ఐదువేల మంది ఎస్సీలు చనిపోయారంట. ఒక్క ఎస్సీ పుట్టలేదంట. కానీ 16 లక్షల మంది ఓసీలు పుట్టారంట. ఒక్క ఓసీ చనిపోలేదంట. సర్వే పేరుతో బీసీలను ప్రభుత్వం మోసం చేస్తున్నది. బీసీలకు అన్యాయం చేస్తే వెయ్యి గొంతుకలై గర్జిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజాయితీగా రాజకీయ, ఉద్యోగ, ఆర్థిక రిజర్వేషన్లు ప్రకటించాలి.
-శెట్టి సురేశ్నాయడు, కూచిపూడి మాజీ సర్పంచ్, కోదాడ రూరల్
బీసీల వాటా తేల్చాల్సిందే..
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ కుల గణన చేస్తుండటంతో మా వాటా మాకు దక్కుతుందని సంతోషించాం. కానీ ప్రభుత్వం ప్రకటించిన సర్వే వివరాలతో అంతా బూటకమేనని అర్థమవుతున్నది. బీసీలను విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణదొక్కాలనే కుట్రతో చేసిన సర్వే అని చెప్పొచ్చు. బీసీలను ఎక్కువగా ఉన్నారని లెక్క తేలిస్తే రాజకీయంగా అగ్రకుల నాయకుల పీటాలు కదులుతాయని వారి భయం. బీసీల వాటా తేల్చకుంటే రాబోయే స్థానిక ఎన్నికలను అడ్డుకుంటాం.
– బంటు వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి బీసీల వ్యతిరేకి
కుల గణన సర్వే సమగ్రంగా జరుగలేదని గణాకాంలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కచ్చితంగా బీసీల వ్యతిరేకి. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఆయన తెలంగాణలోని బీసీలందరినీ మరొక సారి మోసం చేశాడు. కుల గణన పేరుతో బీసీల జనాభాను లెక్కిస్తానని చెప్పి లెక్కలు తప్పుగా చూరారు. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చెబుతున్న మాటలు అన్నీ అబద్ధాలే అని దీన్ని బట్టి తెలుస్తున్నది.
-మట్టపల్లి సైదులు యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మిర్యాలగూడ
కుల గణన నివేదిక తప్పుల తడక
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన నివేదిక తప్పుల తడకగా ఉంది. సర్వే వంద శాతం పూర్తి కాకుండా పూర్తయినట్లు చెప్పడం విడ్డూరం అనిపిస్తున్నది. ప్రతి ఏడూ జనాభా పెరుగుతుంది కాని తగ్గుతుందా? గతంలో 5 శాతం ఉన్న ఓసీలను 15శాతం పెరిగినట్లు చూపించారు. అదే క్రమంలో బీసీ జనాభా ఎందుకు పెరుగదు. బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర చేస్తున్నరు. ప్రస్తుత సర్వే ఫలితాలను పూర్తిగా వెల్లడించాలి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా 52శాతం రిజర్వేషన్లు కల్పించాలి. లేదంటే బీసీలంతా ఏకమై ఉద్యమిస్తరు.
– కొండే కోటేశ్వరీ, బీసీ మహిళా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, చౌటుప్పల్
బీసీలను అణగదొక్కే కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే బీసీలను అణగదొక్కే విధంగా ఉంది. కుల గణన సర్వేలో బీసీల జనాభా ఏవిధంగా తగ్గిందో ప్రజలకు తెలుపాలి. ఈ సర్వే పూర్తిగా అసమగ్రంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుల గణన నివేదికను ఒప్పుకోము. వెంటనే ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా బీసీల కులగణను చేసి చట్టబద్ధత కల్పించాలి. బీసీ రిజర్వేషన్లు 50శాతానికి పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
-బద్దుల ఉమారమేశ్, మాజీ వైస్ ఎంపీపీ, రామన్నపేట
బీసీల సంఖ్యను తగ్గించడం సరికాదు
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన కుల గణన సర్వేలో బీసీలను తగ్గించి చూపించడం సరికాదు. సర్వేపై పూర్తి స్థాయి సమీక్ష జరిపి బీసీలకు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలను రాజకీయంగా సముచిత ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉంది. తాజా సర్వేలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
-పచ్చిపాల కృష్ణయ్య, బీసీ సంఘం నాయకుడు, చందంపేట