రామగిరి, మార్చి 9 : పాఠశాల దశలో పదో తరగతి కీలక ఘట్టం. వార్షిక పరీక్షల నిర్వహణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) చేస్తారు. గతేడాది మార్చిలో జరిగిన పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్‌లో చేశారు. ఆ విధుల్లో పాల్గొన్న స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జిలు, చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, గెజిటెడ్ హెడ్మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ అసిస్టెంట్(ఎస్జీటీలు, సీఆర్పీలు)లకు ఇవ్వాల్సిన పారితోషకంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
దీంతో నల్లగొండ జిల్లాలో వివిధ హోదాల్లో మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న సుమారు 1,550 మంది ఉపాధ్యాయులు పారితోషికం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెల 21న పదో తరగతి పరీక్షలు మొదలు కానుండగా ఏప్రిల్‌లో మళ్లీ మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఈలోగా గత సంవత్సరం నిధులు ఇ్వవాలని, లేని పక్షంలో స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరిస్తామని పలువురు ఉపాధ్యాయులతోపాటు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు.
పారితోషికం ఇలా..
పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు వారి హోదాల ఆధారంగా ప్రభుత్వం పారితోషికం అందజేస్తుంది. సీఈలుగా పనిచేసిన వారికి 9 రోజులుకుగానూ ఒక్కరికి రూ. 7,284, ఏఈలకు రూ. 9వేలకుపైగా, స్పెషల్ అసిస్టెంట్లకు రూ. 2, 475 ఇవ్వాలి. స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జిలు, ఇతర హోదాల్లో పనిచేసిన వారికి వీరికంటే అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంది.
త్వరలో రెమ్యునరేషన్ ఇవ్వాలి
గత సంవత్సరం పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్న టీచర్స్, సిబ్బందికి వెంటనే రెమ్యునరేషన్ అందజేయాలి. ఎండాకాలంలో సైతం స్పాట్‌కు హాజరై మూల్యాంకనం చేస్తే ఇప్పటికీ ఇవ్వకపోవడం బాధాకరం. అధికారులను అడిగితే ఫ్రభుత్వం నిధులు విడుదల చేయలేదని చెప్తున్నారు. నిధులు వస్తాయని ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా దీనిపై వనతి పత్రం అందజేశాం. త్వరలో వాటిని విడుదల చేయకపోతే టీఆర్టీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే స్పాట్ వాట్యుయేషన్స్ బహిష్కరిస్తాం.
– నిమ్మనగోటి జనార్దన్, జిల్లా అధ్యక్షుడు, టీఆర్టీఎఫ్ నల్లగొండ