కొండమల్లేపల్లి, జూలై 4 : పల్లెల నుంచి పట్నం వరకు ఎక్కడైనా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గురించే చర్చ. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎల్వోలు జూన్ 25 నుంచి ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి ఫారాలు నింపి వారంలో తిరిగి ఇవ్వాలని ఓటర్లకు సూచిస్తున్నారు.కానీ ఫారాలు నింపడమే తమకు తలనొప్పిగా మారిందని అయా గ్రామాల ఓటర్లు వాపోతున్నారు. తప్పులు నింపితే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఫారాల్లో వివరాలు నమోదు చేయడం ఓటర్లకు సవాల్‌గా మారింది. దేవరకొండ మండలంలో 58,269, చింతపల్లి మండలంలో 43,774, కొండమల్లేపల్లిలో 29,165, డిండి( గుండ్లపల్లి) మండలంలో 41,632, చందంపేట మండలంలో 30, 235, నేరేడుగోమ్ము మండలంలో 20,024, ఉమ్మడి పెద్ద అడిశర్లపల్లి మండలంలో 39,381మందితో కలిసి దేవరకొండ నియోజకవర్గంలో 2,62,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 85 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది.
2002 ఓటరు జాబితా కోసం వెతుకులాట
ఎస్ఐఆర్ మొదటి కాలంలో 2002 నాటి ఓటరు వివరాలు నమోదు చేయాల్సి రావడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఈ ప్రక్రియ ప్రధాన సమస్యగా 2002 ఓటరు జాబితా నిలుస్తోంది. ఫారంలోని మొదటి కాలమ్‌లోనే 2002 నాటి ఓటరు వివరాలు నమోదు చేయాలని ఎన్నికల సంఘం సూచించడంతో ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ 2002లో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రజలు పరుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఫారాలు నింపడంలో అవస్థలు
ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్న సిబ్బంది వాటిని ఎలా భర్తీ చేయాలో తెలుపడంలేదని జనం వాపోతున్నారు. 2002 సంవత్సరంలో ఓటరు జాబితా ఆధారంగా ప్రస్తుత సర్ ప్రక్రియ కొనసాగుతుంది. 2002 జాబితాలో ఉన్న ఓటర్లు తాజా జాబితాలో ఉన్న ఓటర్లకు ఒకే రకమైన ఫారం ఇస్తున్నారు. అందులో వేర్వేరుగా నింపాల్సి ఉంటుంది. ఎక్కువ మందికి ఈ విషయంలో అవగాహన లేక పత్రాలు నింపడంలేదు. చాలా మందికి ఎపిక్ నంబర్ ఎలా తెలుసుకోవాలో తెలియడంలేదు. నియోజకవర్గంలో భాగం సంఖ్య, క్రమ సంఖ్య, బంధుత్వం తదితరలను ఎలా పొందుపర్చాలనేది కొన్ని చోట్ల బీఎల్వోలకు సైతం తెలియడంలేదు.
ఫామ్ నింపడంలో ఇబ్బంది
అధికారులు ఇంటికి వచ్చి ఫారాలను అందించారు. వాటిని నింపి వారంలోపు తిరిగి ఇవ్వాలని చెప్పారు. కానీ ఫారం ఎలా నింపాలో మాకు తెలియడంలేదు. అందులో 2002 సంబంధించిన ఓటరు కార్డు లేదా ఏదైనా గుర్తింపు పత్రం ఉండాలని చెబుతున్నారు. తప్పులు రాస్తే ఓటు గల్లంతవుతుందనే భయం ఉంది. అధికారులు సిబ్బందిని నియమించి ఫారాలు నింపేలా చర్యలు తీసుకోవాలి.
– ఎండీ ఫయాజ్, కొండమల్లేపల్లి
చొరవ చూపాలి
గ్రామాల్లో చాలా మందికి ఫారాలు నింపడంపై అవగాహన లేదు. తప్పులు నింపి ఇస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక దృష్టి సారించాలి. సిబ్బందిని నియమించి వారితో ఫారాలు నింపితే తప్పులకు అస్కారం ఉండదు.
– పెద్దిశెట్టి సత్యనారాయణ, కొండమల్లేపల్లి