నల్లగొండ, జనవరి 6 : నల్లగొండ జిల్లాలో 15,06,236 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా దేవరకొండ నియోజక వర్గంలో, అత్యల్పంగా మిర్యాలగూడ నియోజక వర్గంలో ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా పురుషులు 7,42,559 మంది ఉండగా, మహిళలు 7,63,550 మంది ఉన్నారు. ఇతరులు 127 మంది ఉన్నారు. ఆయా నియోజక వర్గాల్లో 543 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఓటరు జాబితాను విడుదల చేశారు. జాబితాను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, తాసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రచురించాలని ఆమె ఆదేశించారు. ఓటరు జాబితా విడుదల తర్వాత ఆమె మట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా సోమవారంతో తుది ఓటరు జాబితా పూర్తి అయినప్పటికీ 18 ఏండ్లు నిండిని ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్, ఆర్డీఓలు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో 10,08,151
సూర్యాపేట, జనవరి 6 : సూర్యాపేట జిల్లాలో 10,08,151 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పురుషులు 4,92,466, మహిళలు 5,15,628, ఇతరులు 57 మంది ఉన్నారు. తుది జాబితాను కలెక్టరేట్, ఆర్డీఓ, తాసీల్దార్ కార్యాలయాలు, జిల్లావ్యాప్తంగా 1,205 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారు. అక్టోబర్లో విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 10,04,284 మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడు కొత్తగా 3,867 మంది ఓటు హక్కును పొందారు. వీరంతా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధికంగా తుంగతుర్తి నియోజరవర్గంలో 2,61,357, అత్యల్పంగా సూర్యాపేట నియోజక వర్గంలో 2,46,437 మంది ఓటర్లు ఉన్నారు.