యాదాద్రి భువనగిరి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో విష జ్వరాలు విజృభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లు జోరందుకున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేయడం, ప్రభుత్వం పట్టించుకోపోవడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వైరల్ జ్వరాలతో జనం దవాఖానల ఎదుట బారులుదీరుతున్నారు. జిల్లా కేంద్ర దవాఖానలోనే సౌకర్యాలు కరువయ్యాయి. మండలాలు, గ్రామాల్లో సరైన వైద్య సదుపాయం లేక జనం ప్రైవేట్ దవాఖానలకు పరుగులుదీస్తున్నారు.
ఆస్పత్రులకు రోగుల క్యూ..
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్లు పెరిగిపోతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వ్యాప్తిస్తున్నాయి. జిల్లా కేంద్ర దవాఖానతోపా టు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ ఏరియా ఆస్పత్రులు, 21 పీహెచ్‌సీలతోపాటు సబ్ సెంటర్లు జిల్లాలో ఉన్నాయి. అన్ని చోట్ల రోగులు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచే దవాఖానలకు భారీగా తరలివస్తున్నారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలతో తరలివస్తున్నారు. జిల్లాలో సాధారణంగా ప్రతి రోజూ ప్రభుత్వ దవాఖానలకు 2వేల వరకు ఓపీ నమోదయ్యేవి. ప్రస్తుతం నిత్యం 3వేల పైనే ఔట్ పేషెంట్లు వస్తున్నారు.
ప్రత్యేక పాలన.. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం..
కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. వీరంతా ఇప్పటికే తమ విధులు నిర్వహిస్తూనే.. ఆయా మండలాలు, గ్రామాల బాధ్యతలు చూస్తున్నారు. రెండు పనులు కావడంతో పారిశుద్ధ్యంపై సరిగా ఫోకస్ పెట్టడంలేదని తెలుస్తున్నది. వరుస వర్షాలతో ఊర్లన్నీ చిత్తడిగా మారిపోయాయి. దీంతో గ్రామాలు, పట్టణాల్లో చెత్తచెదారం పేరుకుపోతున్నది. డ్రైనేజీలు క్లీన్ చేయడంలేదు. మురుగు నీరు వచ్చి చేరుతున్నది. దోమలు, ఈగలు రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. పందులు, కుక్కలు పెద్ద సంఖ్యలో సంచరిస్తున్నాయి. అంతే కాకుండా దోమల నివారణకు చర్యలు తీసుకోవడంలేదు.
నిత్యం 300 ఫీవర్ కేసులు..
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఇవి ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉంటూ చర్యలు తీసుకుంటాయి. ఈ బృందంలో జిల్లా మలేరియా అధికారి, జిల్లా సహాయ మలేరియా అధికారి, ముగ్గురు సబ్ యూనిట్ ఆఫీసర్లు ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు జిల్లాలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేస్తుంటారు. ప్రస్తుతం కేసులు నమోదైన చోట జ్వర సర్వేలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య ఉన్న చోట చుట్టు పక్కల ఇండ్లను పూర్తిగా పరీక్షిస్తున్నారు. ఫీవర్ సర్వే ప్రకారం జిల్లాలో ప్రతి రోజు 300 కేసులు నమోదవుతున్నాయి. ర్యాపిడ్ టెస్టులు చేయడంతోపాటు మందులు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నారు.
జిల్లా కేంద్రంలోని దవాఖానలో సదుపాయాల్లేవు..
భువనగిరి పట్టణంలో ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఆస్పత్రిలో పేషెంట్ల తాకిడి పెరిగింది. రోగ నిర్ధారణ పరీక్షలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆస్పత్రిలోని ల్యాబ్ వద్ద నమూనాలు తీసుకోవడానికే గంటల సమయం పడుతున్నది. పదుల సంఖ్యలో రోగులు క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే రోగాలతో బాధపడుతున్న వారు రెండు, నుంచి మూడు గంటల లైన్లో నిల్చోవాల్సి వస్తున్నది. డాక్టర్లు కూడా ఎక్కువ సమయం కేటాయించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రకాల మందులు మాత్రమే అందిస్తున్నారు. వైద్యులు రాసిన చీటీల్లో సగం మాత్రమే ఇస్తున్నారు. మిగతావి బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దాదాపు అన్ని పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
ప్రైవేట్‌లో అడ్డగోలు దోపిడీ..
సీజనల్ వ్యాధుల కాలం వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌లకు పంట పండినట్లే. రోగుల ఇబ్బందులను ఆసరా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. అవసరం లేకున్నా అడ్డగోలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌ల్లో నాణ్యమైన పరీక్షలు నిర్వహించడంలేదు. జ్వరానికి కూడా వేలల్లో వసూలు చేస్తున్నారు. ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నా డెంగీ అంటూ భయపెడుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మరోవైపు జిల్లా జిల్లా వైద్యాధికారులు నిఘా పెట్టడంలేదు. కనీసం పర్యవేక్షించడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.