తుర్కపల్లి, జూన్ 19: గ్రామాభివృద్ధికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిధుల వరద పారిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసిన వాసాలమర్రి గ్రామస్తుల ఆశలు అడియాసలయ్యాయి. గ్రామంలో మౌలికవసతుల కల్పనకు నిధులు ప్రకటిస్తారని చూసిన గ్రామస్తులకు నిరాశే మిగిలింది. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో గురువారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇం డ్ల మంజూరు పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పదేపదే ప్రకటించి కొంతమందికే మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. దీంతో జాబితాలో తమ పేర్లు లేవంటూ మహిళలు స్థానిక కాంగ్రెస్ నేతలను నిలదీశారు. తమకు అనుకూలమైన వారికే ఇండ్ల మంజూరు పత్రాలు ఇప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొంగులేటి పదేపదే విమర్శిస్తున్న సమయంలో మహిళలు, గ్రామస్తుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
మంత్రి ప్రభు త్వ పథకాలను వివరిస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే, నాయకు లు పదేపదే చప్పట్లు కొట్టాలని విన్నవించినా ప్రజల నుంచి స్పందన కరువైంది. మంత్రి ప్రసంగం మొత్తం నా టి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడంతోపాటు తమ ప్రభుత్వ గొప్పలు చెబుతూ డబ్బా కొట్టుకోవడంతోనే సరిపోయింది. సమావేశంలో చామలకిరణ్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు ఉన్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం..
మోతె, జూన్ 19: మోతె మండలం విభళాపురంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలో 146 ఇండ్లు మంజూరు చేయగా 74 ఇండ్ల పనులు మొదలు పెట్టి వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు.
భూభారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. భూ భారతితో ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ లబ్ధిదారుల కుటుంబాలకు చీరలు పంపిణీ చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్, వేణుమాధవరావు, ధర్మారెడ్డి, సీతారాంనాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.