వేములపల్లి, జూన్ 24: “నేను నియోజకవర్గ స్థాయి నాయకుణ్ని, నేను ఎంత చెప్తే అంతే.. ఎమ్మెల్యే నా మాటే వింటాడు.. నేను చెప్పినట్లు చేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా’నంటూ వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఓ మహిళను గత మూడు నెలలుగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు సదరు కాంగ్రెస్ నాయకుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని, ఎమ్మెల్యేకు తాను ఏది చెప్తే అదే నడుస్తుందని నమ్మించాడు.
ఆ మహిళ వద్ద నుంచి ఆధార్, పాన్‌కార్డు, రేషన్‌కార్డు జీరాక్సు కాపీలు తీసుకున్నాడు. ఇల్లు ఇప్పించకపోగా గత మూడు నెలలుగా ఆ మహిళకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. ఆ మహిళ మిర్యాలగూడలోని ఒక కమర్షియల్ సెంటర్లో పనిచేస్తోంది. అక్కడికి కూడా వెళ్లి వేధింపులకు గురి చేస్తుండటంతో సదరు మహిళ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పలుమార్లు ఆ నాయకుడికి ఫోన్ చేసి మా అమ్మాయి జోలికి రావొద్దని చెప్పినా వినకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తన తల్లిదండ్రులు, బంధువులను తీసుకొని మొల్కపట్నంలోని కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో ఆ గ్రామానికి చెందిన వారు కూడా వంద మందికి పైగా గుమిగూడినట్లు సమాచారం. ఆమె పట్ల ఆ నాయకుడు ప్రవర్తించిన తీరును ఆ గ్రామస్తులు సైతం తప్పు పట్టారు. అలాగే ఆ మహిళకు సంబంధించిన జీరాక్స్ కాగితాలను తిరిగి ఇప్పించారు. అదేవిధంగా ఆ నాయకుడు ఫోన్లో ఉన్న మహిళ నంబర్లను సైతం తొలగించారు. మళ్లీ ఆమె జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా ఇలాంటి నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే ఇటువంటి వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.