యాదాద్రి భువనగిరి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంలోని కొనుగోలు కేంద్రంలో బృందం సభ్యులు విచారణ చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లు ఎలా చేపట్టారు..? ఎంత ధాన్యం కొన్నారు..? ట్యాబ్‌ల్లో ఎంట్రీ ఎలా చేశారు..? ఎవరెవరు విధుల్లో ఉన్నా రు..? తదితర అంశాలను ఆరా తీశారు.
అనంతరం కలెక్టరేట్లోని సివిల్ సప్లయ్ డీఎం కార్యాలయం, పౌర సరసఫరాల జిల్లా అధికారి ఆఫీసులో ఫైళ్లను పరిశీలించారు. జిల్లాలో ఇంకా ఎక్కడ అక్రమాలు జరిగాయ ని అడిగి తెలుసుకున్నారు. బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి కొనుగోలు కేంద్రంలో చేతివాటం ప్రదర్శించడంపై ఆరా తీశారు.
పోచంపల్లి మండలంలోని ఓ రైస్ మిల్లు, గుండాల మండలంలోని మరో రైస్ మిల్లులో ధాన్యం మాయం కావడంపై వివరాలు రాబట్టారు. ఆయా రైస్ మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అడిషనల్ సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం అడిషనల్ ఎస్పీ అంజయ్య తెలిపారు. ఇప్పటికే గుండాలలోని మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. తనిఖీల్లో డీఎస్పీ యాదయ్య, తహసీల్దార్ పాష, డీఎం మేనేజర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.