కేతేపల్లి, ఫిబ్రవరి 13 : ‘ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో దేశంలోని ఇతర రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. మన పొరుగు రాష్ర్టాల గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, ఏపీ, ఒడిశాలో అమలు కావడం లేదన్నారు. వ్యవసాయం చేసుకునేందుకు అక్కడి రైతులు మన వారి దగ్గర గుంట, రెండు గుంటల భూమి కొనుగోలు చేసి బోర్ల సహాయంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను వాడుతున్నారని తెలిపారు.
మీ రాష్ట్రంలో కలుపుకొంటే తమకు కూడా ఇటువంటి పథకాలు అందుతాయని ఆయా గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నారని గుర్తు చేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందజేస్తూ అద్భుతమైన రీతిలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని అన్నారు. ప్రపంచంలోనే రికార్డు సృష్టించే స్థాయికి కంటి వెలుగు కార్యక్రమం చేరిందని తెలిపారు. దీని ద్వారా కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేసి ఉచితంగా కండ్లదాలు, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తున్నామన్నారు. ఇటువంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన వారికి కేసీఆర్ హెల్త్ కిట్ అందజేస్తూ తల్లీబిడ్డలను అంబులెన్స్‌లలో క్షేమంగా ఇంటికి చేర్చడం గొప్ప విషయమన్నారు. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ద్వారా మండలంలో సుమారు రూ.35 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మూసీ కుడి కాల్వ 8వ నంబర్ డిస్ట్రిబ్యూటర్‌పై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి సమక్షంలో పలువురు వార్డు సభ్యులు, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బి.స్వర్ణలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బి.శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీ ఎ.వెంకన్నయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బంటు మహేందర్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, వెంకన్నయాదవ్, నాయకులు పాల్గొన్నారు.
చిరుమర్తి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి
కేతేపల్లి : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేసే వ్యక్తి అని, మరో మారు గెలిపించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన నాటి నుంచీ నిత్యం నకిరేకల్ ప్రజల ధ్యాస మినహా ఆయనకు ఇతర ఆర్భాటాలు ఉండవన్నారు. ఏనాడూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిద్రపోని ఎమ్మెల్యే లింగయ్య మాత్రమేనని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో ఎప్పుడు చూసినా చేతిలో కాగితాలతో దర్శనమిస్తాడన్నారు. గ్రామాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్, ఇతర మంత్రులను కలుస్తూ అవసరమైన నిధులు మంజూరు చేయించుకుంటూ నియోజకవర్గ ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తున్నాడని మెచ్చుకున్నారు. తమతోపాటు హైదరాబాద్‌లో ఉంటూనే రెండు గంటల్లో గ్రామాలకు వెళ్లే వ్యక్తి మీ ఎమ్మెల్యే అని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తున్న చిరుమర్తి లింగయ్యను మరోసారి అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.