నకిరేకల్, మే 28 : ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం(నకిరేకల్) సతీమణి వేముల పుష్ప ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ “ కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నకిరేకల్ మండలం చందుపట్ల రాసముద్రం లో మిషన్ కాకతీయ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నాలగూడెంలో ఉన్న తన పాత ఇంటికి కేసీఆర్ వచ్చారని, ఆయనకు అన్నం పెట్టానని… అన్నం పెట్టిన తరువాత సార్ తెలంగాణ ఉద్యమంలో 16 మంది పిల్లలు జైలుకు పోయిండ్రు, చిత్రహింసలకు గురైన్రు, వారికి ఉద్యోగాలు ఇప్పించండి సార్.. అని అడిగినా. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఉన్నా పక్కనే కూచోబెట్టుకుని చెప్పమ్మా అని అడిగిండు..నాకు చానా గుర్తుంది.
మరి నీ ఉద్యోగం సంగతి ఏంది.. అని అడిగినప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. ఫస్టు లిస్టులో పేరు వచ్చినప్పుడు చింపేశారు.. అని చెప్పిన..దానికి కేసీఆర్ సార్ మాట్లాడుతూ చందుపట్ల దగ్గర అందరికీ అన్నం పెట్టింది.. ఆడిందీ.. పాడిందీ అందరికంటే ముందే వచ్చి.. మళ్లీ చాయ్ ఇస్తుంది.. ఇల్లాలి పాత్ర పోషించింది కదా.. ఆమెను పాటలు పాడొద్దనే హక్కు ఎవరికీ లేదు.. బతికున్నంత వరకూ పాటలు పాడుతుందంటూ అందరి ముందు కేసీఆర్ సార్ చెప్పిండని చెప్పుకొచ్చింది.
పాత ఇంట్లనే అందరి ఎదుట 16 మందితో ఉన్న లెటర్‌పై నా పేరు కూడా చేర్చి సంతకం పెట్టిండు.. 16 మందితో పాటు నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసింది. అలా తనకు ఉద్యోగం వచ్చిందని.. అప్పుడు రూ.32 వేల జీతమంటే మాములు విషయం కాదు.. చాలా ఎక్కువ.. అవి పాకెట్ మనీ కంటే ఎక్కువ అని చెప్పుకొచ్చింది.