చండూరు అక్టోబర్ 30 : నల్లగొండ జిల్లా బోడంగిపర్తి గ్రామంలో నెలకొని ఉన్న మంచికంటి వారి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 22వ బ్రహ్మోత్సవా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో 2వ రోజు కార్తీక శుద్ధ నవమి గురువారం ధ్వజ కుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ట, మూలమంత్ర హోమము, గరుడ హోమం స్వామి వారి కి పంచోపనిషత్ శతకట్టాభిషేకం, ధ్వజ రోహణ, బలిహారం, సుదర్శన హోమం ఆరాగింపు లాంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, కళ్యాణ అనంతరం భక్త మహాశయులకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని, కావున భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని దేవాలయ చైర్మన్ మంచికంటి వెంకట్ రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నరసింహచార్యులు, అర్చకులు బ్రిజేష్ శుక్ల, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.