తుంగతుర్తి, మార్చి 25 : రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ ప్రజలు వాహనాలు నడపాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వాహన డ్రైవర్లకు అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు తీసుకునే జాగ్రత్తలు శ్రీరామరక్ష అని, ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యాన్ని చేరుకోవాలన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని, రోడ్డు నియమ నిబంధనలను తప్పక పాటించాలని చెప్పారు. డిఫెన్స్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవచ్చని తెలిపారు. పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని, ప్రమాదాలకు కారణం కాకూడదని ఆయన పేర్కొన్నారు.