దామరచర్ల, ఆగస్టు 25 : యాదాద్రి పవర్ ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామస్తులు సోమవారం నాడు గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భూ నిర్వాసులతో పాటుగా గ్రామస్తులకు కూడా ఇంటికి ఒక ఉద్యోగం లేదా రూ.5 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని నాడు అధికారులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే భూ నిర్వాహితులకు ఉద్యోగాలు కల్పించినప్పటికీ, స్థానికుల గురించి పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కింద సాగు భూములు కోల్పోవడం జరిగిందని, భూములను నమ్ముకుని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న గ్రామస్తులు, రైతు కూలీలు నేడు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
పవర్ ప్లాంట్ నుండి వచ్చే కాలుష్యం సైతం తమ గ్రామం పైనే అధికంగా ప్రభావం చూపుతుందని, గ్రామానికి నష్టం జరుగుతున్నప్పటికీ కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటుతో గ్రామానికి అన్ని రకాలుగా లాభం చేకూరుతుందని ఆశతో నాడు సహకరించినట్లు వెల్లడించారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకుని స్థానికంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఉన్నప్పటికీ నేడు ఉద్యోగాలు కల్పించక పోవడంతో యువకులు, నిరుద్యోగులు, గ్రామస్తులు నిరుత్సాహంగా ఉన్నారన్నారు. నాటి ప్రజాభిప్రాయ సేకరణ 98 జీఓ ప్రకారం 2 వేల ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తామని అధికారులు చెప్పడం జరిగిందని, స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
Damaracharla : వైటీపీఎస్‌లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని వీర్లపాలెం గ్రామస్తుల ఆందోళన