కట్టంగూర్, జూలై 16 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని విమర్శించే స్థాయి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూర్‌లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి జరిగిందంటే అది జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలోనని అన్నారు. పెద్ద నాయకుడిని తిడితే పెద్ద పదవులు వస్తాయనో, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాన్ని అయిపోతావని భ్రమల్లో ఉంటే దయచేసి మానుకోవాలన్నారు. జగదీశ్ రెడ్డికి సవాల్ విసరడం కాదు, తానే వీరేశానికి సవాల్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని, చిత్తశుద్ధి ఉంటే ఉన్న ఫలంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ తనతో పడాలని సవాల్ విసిరారు.
వీరేశం కాంగ్రెస్ వాది కాదని, రేవంత్‌రెడ్డి అనుచరుడన్నారు. ఇప్పకైనా బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుల మీద అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలన్నారు. రాజకీయ బిక్షపెట్టిన జగదీశ్‌రెడ్డినే సవాల్ చేసే పరిస్థితి వచ్చిందంటే తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లకు బిల్లులు కట్టలేక, డీజిల్ పోయలేని దుస్థితి నెలకొందన్నారు. విమర్శలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి ఆదరణ పొందాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, నాయకులు పాదూల శిశుపాల్ రెడ్డి, గుండాల మల్లేశ్, మేకల రమేశ్, కట్ట శంకర్, కాడింగ్ అశోక్ పాల్గొన్నారు.