రామగిరి, ఏప్రిల్ 01 : నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో వివిధ అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సమస్యలను నేరుగా చర్చించే ప్రజాస్వామిక వాతావరణం ఉందన్నారు. సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారం దిశగా స్పందించడం జరుగుతుందని తెలిపారు. మెస్సుల నిర్వహణ విద్యార్థులు చేపట్టినందున వారి మధ్య అనేక అపోహలు, అనుమానాలకు తావు లేకుండా ఇక మీదట లైసెన్స్ కలిగిన వ్యాపార సంస్థల నుండే వస్తువులు కొనుగోలు చేయాలని విద్యార్థులు తీర్మానించి అధికారుల ముందు సంతకాలు చేశారు.
నాణ్యత విషయంలో రాజీ పడకుండా వసతి గృహాల నిర్వహణ, భోజన సదుపాయాలు కల్పించాలని అందుకు విద్యార్థి నిర్వాహకులు సైతం క్రమశిక్షణతో, నిజాయితీతో మెలగాలన్నారు. ఆహార భద్రత ప్రమాణాలు పాటించే వ్యాపార సంస్థల నుండి మాత్రమే ఇకమీదట సరైన జిఎస్టి బిల్లులను మాత్రమే ఆమోదించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, హాస్టల్స్ డైరెక్టర్ దోమల రమేశ్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీదేవి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వసంత, ఇంజినీరింగ్ ఆచార్య రేఖ, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎంజీయూ హాస్టల్స్ విద్యార్థులతో వీసీ ముఖాముఖి