నీలగిరి, జూన్ 26 : నల్లగొండ పట్టణంలోని 17వ డివిజన్ పరిధిలో గల పద్మశాలి నగర్ దగ్గర ఉన్న వల్లభరావు చెరువు కట్ట వెంబడి చెత్తాచెదారం వేస్తూ డంపింగ్ యార్డ్ గా మారుతున్న పరిస్థితిని పరిశీలించి మున్సిపల్ అధికారులు వెంటనే శుభ్రం చేయించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం 17, 35 డివిజన్ శాఖ ఆధ్వర్యంలో చెరువు కట్టను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం వల్లభరావు చెరువును బతుకమ్మ కుంటగా మార్చి పద్మశాలి నగర్ నుండి అద్దంకి బైపాస్ వరకు కట్ట నిర్మాణం ఆధునీకరించి, సిసి రోడ్డు, లైట్లు వేసి మినీ ట్యాంక్ బండ్ గా పట్టణ ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని సృష్టించడానికి తయారు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కట్టపై చెత్తాచెదారం వేస్తూ పాత బట్టలు, ఇల్లు కూల్చిన మట్టి తెచ్చి అక్కడ పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం దోమల బెడదతో పద్మశాలి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మందుబాబులు మధ్యాహ్నం నుండే ఆ కట్టపై కూర్చొని తాగుతున్నారని, మహిళలు బయటకు వెళ్లి రావాలంటే భయానక వాతావరణం ఉందన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలు అక్కడ చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు కట్టపై మద్యం తాగకుండా గస్తీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 17, 35వ వార్డు శాఖ కార్యదర్శి గంజి నాగరాజు, పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, గంజి రాజేష్, కొత్తపల్లి హరీష్, దుడుగు భిక్షపతి, గంజి శంకరయ్య పాల్గొన్నారు.