మఠంపల్లి, అక్టోబర్ 4 : నిజాం కాలంలో నిర్మించిన మూసీ పునర్నిర్మాణానికి అన్ని వర్గాలు మద్దతు తెలుపాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. మూసీ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. శుక్రవారం మట్టపల్లి వద్ద విలేకరులతో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జీవధారగా ఉన్న మూసీనదిని దశాబ్దాలుగా ప్రక్షాళన చేయక కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు. పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న పనిని అందరూ స్వాగతించాలన్నారు. ప్రక్షాళన తరువాత మల్లన్నసాగర్ నుంచి 2 టీఎంసీల నీటిని తీసుకొని గండిపేటకు, అక్కడి నుంచి మూసీ నదిలోకి తీసుకువస్తామన్నారు.
వ్యవసాయానికే గాక తాగేందుకు పనికి వచ్చేలా మూసీ నీటిని అందిస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భూక్యా మంజూనాయక్, రామిశెట్టి అప్పారావు, వంటిపులి శ్రీనివాస్, సుబ్బారావు, దేశ్‌ముఖ్, న్యాయవాదులు సాముల రాంరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, బాలకృష్ణ, శ్రీనివాసరావు, చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, వంగవీటి రామారావు ఉన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి ఇటీవల మరణించగా, ఆయన అస్తికలను కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కృష్ణానదిలో కలిపారు.