సూర్యాపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు అంతాఇం తా కాదు. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తీసుకురాకపోయినప్పటికీ సకాలంలో వర్షాలు పడడంతో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా నాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఐదారు రోజులుగా రైతులు యూరి యా కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. వానకాలం సీజన్లలో నిత్యం పదివేల మెట్రిక్ టన్నుల్లో యూరియా రాగా, ప్రస్తుతం మూడు నాలుగు రోజులకోసారి 350 నుంచి 400 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుంది. నాట్లు పడిన తర్వాత జిల్లాకు ఆగస్టులో 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ప్రస్తుతం జిల్లాలో 23 వందల మెట్రిక్ టన్నుల స్టాక్ మాత్రమే ఉంది. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో శుక్రవారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్, తుంగతుర్తిలో యూరియా కష్టాలు షురూ అయ్యాయి. బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో సాగుకు ఏమేం కావాలో అన్నింటినీ సమకూర్చి దశాబ్దాల తరబడి కరువుతో అల్లాడిన రైతులకు నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం ఇలా అన్నీ ఇచ్చి ఆనందంగా ఉండేలా జేబులు గళగళలాడేలా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో యూరియాకు అల్లాడిన అన్నదాతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీజన్ ప్రారంభానికి ముందే ఇండెంట్ పెట్టి కావాల్సినంత యూరియా తెచ్చి సీజన్ పూర్తయ్యే వరకు ఎలాంటి కొరత లేకుండా చేశారు. జిల్లా పరిధిలో 47 ప్రాథమిక సహకార సొసైటీలు, మరో 32 సబ్‌సెంటర్లు ఏర్పాటు చేసి మొత్తం 79 సెంటర్లలో యూరియాను విక్రయించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సదరు ప్రాథమిక సహకార సొసైటీలు, సబ్‌సెంటర్లు దాదాపు యాభైశాతం ఖాళీగా దర్శనమిస్తుండడం గమనార్హం. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, పాలకుల్లో అవగాహన లేకపోవడమే. వ్యవసా య శాఖ అధికారులు సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో ఏ పంట ఎంత సాగు చేస్తారు…ఏ పంటకు ఎరువు ఎంత అవసరం అనే ప్రణాళికలు సిద్ధం చేసి నివేదికలు పంపించినా.. ప్రభుత్వం తదనుగుణంగా యూరియాకు ఇండెంట్ పెట్టి తీసుకురాలేదు. అందుకే నేడు అన్ని ప్రాంతాల్లో రైతులకు ఎరువుల కష్టాలు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో మాత్రం ఈ సీజన్ ప్రారంభమైన నెల రోజుల వరకు కాళేశ్వరం జలాల కోసం ఎదురు చూసిన రైతులు కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు ధైర్యంతో నాట్లు వేశారు. పది రోజులుగా జిల్లాలో ఉన్న యూరియా గోదాములు ఖాళీ అవుతున్నాయి. పైనుంచి యూరియా రావడం తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో తొలిసారి శుక్రవారం యూరియా కోసం క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇంకా రెండు మూడు రోజు ల్లో యూరియా స్టాక్ రానిపక్షంలో ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు 6 నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరుగుతుండగా, రోజుకు కేవలం 350 మెట్రిక్ టన్ను లు మాత్రమే వస్తోంది. ఆగస్టు మాసానికి 19వేలు, సెప్టెంబర్‌కు 22 వేల మెట్రిక్ టన్నులు వస్తేనే యూరి యా ఇక్కట్లు తప్పుతాయని అధికారుల ద్వారా తెలిసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా తీసుకువచ్చి రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
తుంగతుర్తి, ఆగస్టు 22: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు సేవ సహకార సంఘంతోపాటు మరికొన్ని యూరియా సరఫరా కేంద్రాల్లో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. రైతులకు ఎన్ని ఎకరాల పొలం ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇవ్వడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి యూరియా కొరత లేకుండాష పరిమితులు లేకుండా సకాలంలో అందించారని పలువురు రైతులు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యవసాయానికి సరిపోయే యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.