– రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం
మునుగోడు, జనవరి 24 : యూరియా యాప్ను పూర్తిగా రద్దు చేయాలని, అన్ని మండలాలకు సరిపడా యూరియాని రైతులకు అందించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక తాసీల్దార్కి మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ వికాస్ యోజన.యాప్ తీసుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, దాంతో పాటు ఇంటర్నెట్ సర్వర్ బిజీగా ఉండడం, లాంగ్వేజ్ సమస్య తదితర సాంకేతిక సమస్యతో యూరియాను సరైన సమయంలో పొందలేకపోతున్నారన్నారు. యాప్లో తలెత్తిన సమస్యలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో రైతులకు అర్థం కాని పరిస్థితులు అన్నారు. కావునా ప్రభుత్వం గతం మాదిరిగానే సొసైటీల ద్వారా ఫర్టిలైజర్ షాపుల్లో యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం వరి నాట్లు అయిపోయి నెల కావస్తున్నా యూరియా అందుబాటులో లేక రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా యూరియాను ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బండమీది యాదయ్య, మందుల పాండు, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బిలాలు, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మండల కార్యవర్గ సభ్యులు ఈదులకంటి కైలాశ్, దుబ్బ వెంకన్న, ముంత నరసింహ, బైరుగొండ వెంకన్న, కురుమర్తి ముత్తయ్య, బి.నరసింహ, నందిపాటి అశోక్, జి.నరసింహ, సత్యనారాయణ, కట్ట లాలు, జి.నరేందర్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఉదయ్ కుమార్, కట్కూరి లింగస్వామి, మిర్యాల యాదయ్య, బి.కిరణ్ పాల్గొన్నారు.