– బస్తా యూరియా కోసం పీఏసీఎస్ వద్ద రైతుల నిరీక్షణ
కట్టంగూర్, ఆగస్టు 21 : కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23 వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11 వేల ఎకరాల్లో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం రైతులు తిండితిప్పలు వదిలి రాత్రి పగలు తేడా లేకుండా ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. పీఏసీఎస్ ద్వారా ఇప్పటికే మూడుసార్లు సరఫరా చేసినా సాగు అవసరాలు తీరడం లేదు. గురువారం పీఏసీఎస్ కార్యాలయానికి ఒక లారీ లోడు 330 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రైతులు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జీరాక్స్ సీరియల్లో పెట్టి తమ వంతు కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. కొన్ని సందర్భాల్లో తోపులాట జరడగంతో పరిస్థితి అదుపులోకి తేచ్చేందుకు పోలీసులను పిలిపించి వారి పహారా మధ్య ఒక్కో రైతుకు బస్తా చొప్పున ఏఓ గిరి ప్రసాద్, సీఈఓ బండ మల్లారెడ్డి పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు.
అప్పటికి చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో తాము ఎన్ని రోజులు యూరియా కోసం పనులు వదులుకుని తిరగాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మండల స్పెషల్ ఆఫీసర్ (జీఎం ఇండ్రస్ట్రీస్) సతీశ్, ఎస్ఐ మునుగోటి రవీందర్ అక్కడికి చేరుకుని రైతులకు సరిపడా యూరియా వస్తుందని, అందరికీ అందజేస్తామని చెప్పారు. రైతులు నానో యూరియాను వాడుకోవాలని, అది కూడా పని చేస్తుందని సూచించారు. మండలానికి 2,400 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1,800 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని మిగతా 600 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి గిరి ప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల పహారా మధ్య యూరియాను తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గాని దొరకని పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Kattangur : కట్టంగూర్‌లో పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ