– ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన
రామగిరి, ఏప్రిల్ 20 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బాలుర హాస్టల్స్ భోజనంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలుర హాస్టల్స్‌లోని మెస్‌లో మధ్యాహ్న భోజనంకై వెళ్లి విద్యార్థులకు వడ్డించిన అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఇదేమి అన్నం, ఎలా తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరుతూ హాస్టల్ మెస్‌లకు తాళం వేశారు. దీంతో వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్ తో పాటు విద్యార్థులు అధికారుల వైఖరీని నిరసిస్తూ హాస్టల్స్ మెస్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత లేకుండా ఉండటం, అందులో పురుగులు కనిపించడం యాజమన్యం వైఫల్యమేనని విమర్శించారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వీసీ, రిజిస్ట్రార్స్ ఉండని అయితే ఈ విషయం వారికి తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉందని తెలిపారు. యూనివర్సిటీలో గతంలో సహితం ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో వీసీ స్వయంగా మాట్లాడి ఇలాంటి సంఘటనలు తిరిగి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని ఆహారం తినడంతో ఎంతో మంది విద్యార్థుల అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్, సంపత్, సతీష్, విజయ్, వెంకటేష్, సుధీర్, అరవింద్, పృధ్వీ, సాయి, గోపి, ప్రణయ్ పాల్గొన్నారు.

ఎంజీయూ హాస్టల్స్ భోజనంలో పురుగుల కలకలం