యాదగిరిగుట్ట,మే 24 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. గర్భాలయం, స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో స్పష్టంగా కనిపిస్తోంది. నరసింహస్వామి ఆశీస్సులతో.. వేద మంత్రోచ్ఛారణల మధ్య.. వేద పాఠశాల నిర్మాణానికి శ్రీకారం అని కామెంట్ చేస్తూ సుమారుగా 2.55 నిమిషాల నిడివి గల వీడియోను ఆదివారం సీఎం ఎఫ్బీ ఖాతాలో ఆప్లోడ్ చేశారు. ఈ వీడియోలో సీఎం ఆలయంలో ప్రవేశించడం, పూర్ణకుంభ స్వాగతం, గర్భాలయం, స్వయంభూ స్వామివారి దర్శనం, అనంతరం దేవస్థాన అధికారులతో ఫొటోలు దిగుతున్న వీడియోతో పాటు టెంపుల్ సిటీపైన వేదపాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ వంటి కార్యక్రమాలు వీడియోలో నిక్షిప్తమయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. 50 సెకన్ల నుంచి నిమిషం వరకు ఉన్న వీడియోలో సీఎం గర్భాలయ ప్రవేశం, గర్భాలయంతో పాటు స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామివారు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇలాంటి వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం దేవస్థాన నిబంధనలకు విరుద్ధం.
ఆలయ ముఖ మండపం, స్వయంభూ గర్భాలయం, స్వయంభూ స్వామివారిని ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం. హిందూ దేవాలయాల్లో గర్భగడి అత్యంత పవిత్రమైనది. ఆగమ శాస్త్రం ప్రకారం మూలవిరాట్ (ప్రధాన దైవం) ఉన్న ఈ ప్రదేశాలను ఫొటోలు, వీడియోలు, తీయడం నిషిద్ధం. గర్భగుడిలో దైవశక్తి ఆవరించి ఉంటుంది. ఫొటోలు, వీడియోల వల్ల కలిగే క్రాంతి పరికాల శబ్దాలు ప్రశాంతతకు భంగం కలిగిస్తాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దేవస్థానం అధికారులు స్వామివారి ఆలయంలోకి సెల్ఫోన్లు, వీడియోలు, కెమెరాలను అనుమతించరు. ఒకవేళ ఎవరైనా వీడియో తీస్తే వెంటనే వాటిని డిలీట్ చేస్తారు. అలాంటిది ముఖ్యమంత్రి పర్యటనలో స్వామివారు స్పష్టంగా కనిపిస్తున్నట్లు వీడియో చిత్రీకరిస్తుంటే దేవస్థాన ఎస్పీఎఫ్ సిబ్బంది, దేవస్థాన అధికారులు చూస్తూ ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు సీఎంతో వచ్చిన వీడియో గ్రాఫర్ సైతం వీడియో తీస్తూ గర్భాలయం వరకు వెళ్లినట్టు వీడియోలో ఉంది. సాధారణ భక్తులు వీడియో తీస్తే డిలీట్ చేసే అధికారులు ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా స్వయంభూ స్వామివారి వీడియోను తన వ్యక్తిగత ఫేస్బుక్లో వైరల్ చేస్తే భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని భావిస్తున్నారు. వీడియోను తొలగించాని డిమాండ్ చేస్తున్నారు.