తుర్కపల్లి/రాజాపేట/వలిగొండ/సంస్థాన్‌నారాయణపురం/చౌటుప్పల్, ఏప్రిల్ 3 : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలకు కూలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
ఈదురు గాలులకు పెద్ద ఎత్తున మామిడి కాయలు రాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన వరి పంటలు కూడా దెబ్బతిన్నాయి. పలుచోట్ల భారీ వర్షం పడడంతో వరద పోటెత్తి ఇండ్లలోకి నీరు చేరింది. తుర్కపల్లి, రాజాపేట, భువనగిరి, ఆత్మకూర్.ఎం, గుండాల, మోత్కూరు, ఆలేరు, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, వలిగొండ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాజాపేట, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురంలో పిడుగుపాటుకు మూడు పాడి బర్రెలు మృతి చెందాయి.