యాదాద్రి భువనగిరి, మే 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆదిలోనే అడుగు ముందుకు పడడం లేదు. మహిళా రైతులకు సబ్సిడీపై యంత్రాలు, పరికరాలు అందించే స్కీమ్ ప్రారంభం కాకముందే అటకెక్కింది. హడావుడిగా దరఖాస్తులు స్వీకరించినా, నిధులు లేకపోవడంతో ఆచరణలో అమలు చేయడం లేదు.
వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. దాంతో సబ్సిడీపై యంత్రాలు, పరికరాలను అందించాలని వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా రైతులకు అందించాలని నిర్ణయించి, ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా కార్యాచరణతోపాటు, కేటాయింపులు కూడా చేసింది.
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం అర్హులైన రైతుల నుంచి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మార్చిలో ఈ ప్రక్రియ పూర్తయింది. వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. అర్హుల జాబితా తర్వాత లబ్ధిదారుల నుంచి డీడీలు తీసుకోవాల్సి ఉంది. వ్యవసాయ అధికారులు గుర్తించిన రైతులు 50శాతం సబ్సిడీతో యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి కూడా లేదు.
పథకం అమలైతే 14 రకాల యంత్ర పరికరాలు 50 శాతం సబ్సిడీతో మహిళా రైతులకు అందే అవకాశం ఉంది. పవర్ స్ప్రేయర్లు, చేతి పంపులు, డ్రోన్లు, రోటోవేటర్లు, విత్తనాలు/ఎరువులు చల్లే పరికరాలు, ట్రాక్టర్‌తో దమ్ము చేసే పరికరాలు, పవర్ టిల్లర్లు, ఎద్దులతో బోదలు పోసే పరికరాలు, ట్రాక్టర్లతో బోదలు పోసే పరికరాలు, పవర్ రీడర్స్, బ్రష్ కట్టర్స్, ట్రాక్టర్లు, మొక్కజొన్న కోత పరికరాలు, గడ్డిచుట్టే యంత్రాలు సబ్సిడీలో లభించనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 247 పరికరాలకు రూ.72 లక్షలు, సూర్యాపేటలో 457 పరికరాలక కోటి రూపాయులు, నల్లగొండ జిల్లాలో 820 పరికరాలకు రూ.1.80 కోట్లు మంజూరు కూడా అయ్యాయి. కానీ, ప్రభుత్వం పథకాన్ని అమలు చేయపోవడానికి నిధుల లేమే కారణంగా తెలుస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రాజ్యం తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించింది. తీరా పాలన పగ్గాలు చేపట్టాక అన్నదాతలకు మొండి చెయ్యి చూపున్నది. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సీజన్ రూ.7,500 చొప్పున ఏడాదికి 15 వేలు పంట పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది. కానీ కేవలం ఎకరాకు రూ. 5 వేల చొప్పున మాత్రమే విడుదల చేసింది. ఆది కూడా ఒక్క సీజన్‌కే ఇచ్చింది. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. వానకాలం పంటకు రైతు భరోసా ఇవ్వలేదు. యాసంగి సీజన్లో సగం మందికి కూడా డబ్బులు జమ చేయలేదు. ఇప్పుడు యాంత్రీకరణ పథకాన్ని కూడా ఆ దారిలోకి నెడుతున్నట్లు స్పష్టమవుతున్నది.