ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి గోస అంతా ఇంతా కాదు. చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతుండే. చేతికొచ్చే పంటలు దక్కకపోతుండే. గుక్కెడు తాగు నీటికీ కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్ల దగ్గర నుంచి తెచ్చుకునే పరిస్థితి. స్వరాష్ట్రంలో అవన్నీ పోయాయి. మిషన్ కాకతీయ ఫలితంగా చెరువులు, కుంటలు.. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో నదులు, కాల్వ ప్రవాహాలు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు గోదావరి జలాల రాకతో పాతాళ గంగ ఉబికివచ్చింది. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం సగటున 5 నుంచి 6 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. ఎండాకాలంలోనూ చెరువులు, చెక్‌డ్యామ్‌లు నీటితో నిండుగా ఉన్నాయి. బోర్లు, బావుల ద్వారా మోటర్లు ఫుల్‌గా పోస్తున్నాయి. గత నాలుగు నెలల్లో తగ్గిన భూగర్భ జలాలు కేవలం 1.65 మీటర్లే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే దీనికి కారణమని ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగడం, మంచి దిగుబడి రావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ (2022) 3.94
జనవరి 4.49
ఫిబ్రవరి 5.21
మార్చి 5.59
సూర్యాపేట, ఏప్రిల్ 20 : నీటి సంరక్షణ చర్యలతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు పైలంగా ఉంటున్నాయి. భూగర్భ జలాల తగ్గుదల ఏటేటా తగ్గుతున్నది. గతంలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి రైతన్నలతోపాటు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టడంతో జిల్లాలో భూగర్భ జలాల తగ్గుదల పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. నాలుగు నెలలుగా జిల్లా వ్యాప్తంగా 1.65 మీటర్ల లోతుకు మాత్రమే భూగర్భ జలాలు తగ్గాయి. ఈ నెల 15 నాటికి వరి కోతలు ప్రారంభమవడంతో వ్యవసాయానికి నీటి వాడకం తగ్గింది. మే నెలలో ప్రతి ఏటా కాళేశ్వరం జలాలతో సుమారు 530 చెరువులు నింపుతుండంతో భూగర్భ జలాలకు ఎలాంటి ఢోకా ఉండదు. మూసీ నది, పాలేరు వాగులపై పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీతతో చెరువులు నిండుకుండలా ఉన్నాయి.
సమైక్య రాష్ట్రంలో మార్చి నెలలోనే సాగు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి. దీంతో రైతన్నలు పంటను తగులబెట్టడం.. పశువులను మేపడం చేసేది. తాగునీటి కోసం ఆడబిడ్డలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో దాదాపు 24 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండేవి. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత జిల్లాలోని 1071 చెరువులకుగాను రూ.180 కోట్లతో 845 చెరువుల్లో పూడిక తీయించి ఆధునీకరించారు. వీటికి తోడుగా మూసీ నది, పాలేరు వాగుపై దాదాపు 20 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు.
కాళేశ్వరం జలాల రాకతో జిల్లాలో భూగర్భ జలాల పైపైకి వచ్చాయి. గతంలో తిరుమలగిరి మండలంలో 24 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 2.96 మీటర్ల లోతులోనే ఉన్నాయి. రెండు పంటలకు నీరు అందించడంతోపాటు వేసవిలో దాదాపు 530 చెరువులను నింపుతున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా వేసవిలో చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నారు. దీంతో జిల్లాలోని అనేక చెరువులు మండు వేసవిలో సైతం మత్తడి దుంకుతున్నాయి. ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంత తీయించారు. జిల్లా వ్యాప్తంగా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటుండడంతో 15 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం సగటున 5నుంచి 6 మీటర్ల లోతులోనే ఉన్నాయి.
రెండు మండలాల్లో 10 మీటర్లకు పైగా లోతులో
సూర్యాపేట జిల్లాలో 23 మండలాలకుగాను రెండు మండలాల్లోనే పది మీటర్ల కంటే లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. మార్చి నెల లెక్కల ప్రకారం సూర్యాపేట మండలంలో 10.41 మీటర్లు, హుజుర్నగర్లో 11.30 మీటర్ల లోతులో ఉన్నాయి. 11 మండలాల్లో 5 మీటర్ల కన్నా తక్కువ లోతులో ఉండగా.. పది మండలాల్లో 5నుంచి 10 మీటర్ల మధ్యలో భూగర్భ జలాలు ఉన్నాయి. మోతె, కోదాడ మండలాల్లో కేవలం 1.91 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి.
అధిక ఉష్ణోగత్రలతో ఆవిరవుతున్న నీరు..
ఏప్రిల్ మొదటి వారంలో దాదాపు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల కారణంగా దాదాపు 25 నుంచి 30 శాతం నీరు ఆవిరైపోతుంది. దీంతో ఏప్రిల్, మే నెలల్లో నీటి ఆవిరి అధికంగా ఉంటుందని భూగర్భ జలాల అధికారులు చెబుతున్నారు. కానీ.. చెరువులు నింపడంతో ఆ సమస్య కనిపించదని అంచనా వేస్తున్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో నీటి వినియోగం పూర్తిగా తగ్గి.. భూగర్భ జలాల తగ్గుదల తగ్గిపోతుంది.