– స్పెషల్ ఆఫీసర్ మారినా.. మార్చని నేమ్ బోర్డు
నకిరేకల్, జూలై 07 : నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు మే 6వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. మే 7వ తేదీ నుండి నల్లగొండ ఆర్టిఓ వై.అశోక్ రెడ్డి నకిరేకల్ మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. మే 7వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక అధికారిగా అశోక్ రెడ్డి కొనసాగారు. జులై 1వ తేదీన నల్లగొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి నకిరేకల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు వారం రోజులు గడుస్తున్నప్పటికీ ప్రత్యేక అధికారి వై.అశోక్ రెడ్డి పేరుతో ఉన్న నేమ్ బోర్డు మున్సిపల్ కార్యాలయంలో దర్శనమివ్వడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ మేనేజర్ సహా దాదాపు 30 మందికి పైగా అధికారులు రోజూ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి పోతుంటారు.
కానీ ఎవరికీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి బోర్డు కనబడకపోవడం గమనార్హం. కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులకు ప్రత్యేక అధికారి మారిన విషయం కూడా తెలియకపోవడం శోచనీయం. దాదాపు 45 వేలకు పైగా ఉన్న పట్టణ జనాభాలో ఏదో పనిమీద మున్సిపల్ కార్యాలయానికి ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా ప్రజలు ఏదో పనిపై వచ్చి వెళ్తుంటారు. ఏ అధికారి ఎవరు అనేది నేమ్ బోర్డు ఆధారంగానే వారి వద్దకు వచ్చి పని చేయించుకుంటారు. కానీ బోర్డులే సరిగ్గా మార్చనప్పుడు ఏ అధికారి ఎవరు అనే విషయం ప్రజలకు ఎలా తెలుస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వారి పనితీరు మార్చుకొని ప్రజలకు బాధ్యతగా, జవాబుదారీతనంగా వ్యవహరించాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.