Road Accident | నార్కెట్‌పల్లి : నల్లగొండ జిల్లా పరిధిలోని నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం గ్రామ శివారు సమీపంలో జాతీయ రహదారి 65పై ఆదివారం తెల్లవారుజామున అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ క్రాంతి కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే లారీని హైవేపై ఆపి టీ తాగుతుండగా.. అదే సమయంలో కారు వేగంగా వచ్చి.. దాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సాయి, ప్రవీణ్ ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.