చివ్వెంల,ఏప్రిల్ 8: పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 10 మంది గాయపడిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లభాపురం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన జనిగ నర్సింహారావు(36) మఠంపల్లి మండల కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. మేనల్లుడు శ్రీకాంత్ పెళ్లి బుధవారం జరుగుతున్నందున మొక్కులు చెల్లించుకునేందుకు వ్యవసాయంతోపాటు డ్రైవింగ్ పనిచేసే జనిగె సతీష్(25)తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దైవదర్శనానికి చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు టాటాఏస్(టీఎస్ 29 7150)లో బయలు దేరారు. ఈ క్రమంలో మార్గం మధ్యలోని వల్లభాపురం శివారు జగన్ నాయక్‌తండా వద్ద ఉన్న ఏచర్ల ముత్యాలమ్మ గుడి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం టాటాఏస్‌లో పెద్దగట్టు వద్దకు వెళ్తుండగా కోదాడ నుంచి సూర్యాపేట వైపుకు వస్తున్న డీసీఎం (ఎంపీ 13 జీబీ 5716) అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో సతీష్ తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెం దాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహారావు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించగా అక్కడ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గాయపడిన వారిలో జనిగ వెంకమ్మ, లింగయ్య, శ్రీను, శశి, ఆవుల గంగయ్య ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. వారిని సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. నర్సింహారావుకు గతంలో భార్య మృతి చెందగా రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నర్సింహారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఖంలో మునిగిపోయారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కనకరత్నం తెలిపారు.