కట్టంగూర్, జూన్ 30 : కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మ గూడెం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా, బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో ఏపీలోని భీమవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గం మధ్యంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పరిధిలోకి రాగానే ఆకస్మాత్తుగా టైరు పేలింది.
దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతల వైపు హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో కర్ణాటకకు చెందిన బస్సు డ్రైవర్ సిద్ది లింగస్వామి క్యాబిన్లో ఇరుక్కుపోగా, మహబూబ్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ గోనె కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. కట్టంగూర్కు చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ శ్రీనివాస్, పైలట్ సమీర్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, కేసు దర్యాప్తు చేపట్టారు.