సూర్యాపేట, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఈసారి వానకాలంలో సాగు సాగడం అంత సులువుగా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు పడవని.. కరువు వస్తుందనే ప్రచారంతో రోహిణి, ఆరుద్ర కార్తెలు దాటి పోతున్నా రైతులు నార్లు పోయలేదు. చిన్న సాకు చూపించి కాళేశ్వరాన్ని పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని ఇస్తుందనే నమ్మకం రైతుల్లో కనిపించడం లేదు. ఇప్పటికే చెరువులు, కుంటలు ఖాళీగా దర్శనమిస్తుండగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మరోపక్క నాగార్జునసాగర్ జలాశయంలో నీరు అడుగంటుతుండటంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి 4.84 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారిక లెక్కల అంచనా. ఇప్పటి వరకు 1,300 ఎకరాలకు మించి నాట్లు పడలేదు. గతంలో వానకాలం సీజన్లో జూన్ 20 నాటికి 50 వేలకుపైనే ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. మరో పదిహేను రోజుల్లో వర్షాలు పడకుంటే మళ్లీ కరువు తప్పదేమోనని రైతాంగం భయాందోళన చెందుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఓ పక్కన కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు, మరో పక్క నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలు రావడంతో రైతాంగం సమృద్ధిగా ఏటా రెండు పంటలు పండిస్తూ వచ్చారు. సూర్యాపేట జిల్లాలో దాదాపు 6.40 లక్షల ఎకరాల భూమి ఉంది. గతంలో 3.5 లక్షల ఎకరాలకు మించి సాగులోకి రాకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో 6.15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నీటి నిర్వహణ లోపం కారణంగా రైతాంగానికి గత ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు కండ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయి. రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జిల్లాలో ప్రతి సీజన్లో పంటలు ఎండుతున్నాయి. ఈ వానకాలంలోనైనా సమృద్ధిగా వర్షాలు కురిసి నదీ జలాలు పారి కాలమవుతుందా? లేక మళ్లీ కాంగ్రెస్ కారణంగా కరువు అలుముకుంటుందా? అని రైతాంగం మల్లగుల్లాలు పడుతోంది.
వానకాలంలో వరినాట్లు జోరందుకోవాల్సి ఉండగా వర్షాలు పడటం లేదు. నదీ జలాలపై నమ్మకం లేక నత్తనడకన కూడా నాట్లు పడటం లేదు. సాధారణంగా రోహిణి, ఆరుద్ర కార్తెల్లో వరి నార్లు పోస్తారు. ఈ వానకాలంలో కొద్దోగొప్ప తప్పిస్తే వర్షాలు పడకపోవడంతో రైతులు వెనుకాముందాడుతున్నారు. ఇప్పటికే దుక్కు లు దున్ని నారుమళ్లు సిద్ధం చేసుకొని నాట్లు వేయాల్సి ఉండగా నాగార్జునసాగర్‌లో జలాలు డెడ్‌స్టోరేజీలో ఉండటంతో కొంతమేర బావులు, బోర్ల కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. మెజార్టీ భూముల్లో ఇప్పటి వరకు కనీసం దుక్కులు కూడా దున్నకపోవడం గమనార్హం. మరోపక్క కాళేశ్వరం నుంచి గత సీజన్‌కే నీటిని విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి నీటిని విడుదల చేస్తుందనే నమ్మకం లేకపోగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు నీటి విడుదలపై ప్రకటన కూడా చేయలేదు. దీంతో కాళేశ్వరం ఆయకట్టు పరిధిలోని సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది జూన్ 10 నాటికి దాదాపు 50 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి కాగా ప్రస్తుతం 1,300 ఎకరాల్లో కూడా పూర్తి కాకపోవడం పట్ల వరిసాగు ఎలా ఉంటుందో? అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆరుతడి పంటల పరిస్థితి అదే మాదిరిగా ఉంది. 90 వేల ఎకరాల్లో పత్తి వేస్తారనే అంచనా ఉండగా ఇప్పటి వరకు 40 వేలకు మించలేదు. మరో పదిహేను రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగి ఎగువన వర్షాలు కురిసి నాగార్జునసాగర్‌కు నీళ్లు రాకున్నా, వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండకపోయినా, కాళేశ్వరం జలాలపై ప్రభుత్వం ప్రకటన చేయకపోయినా కరువు ఖాయం. ఇప్పటికైనా వానకాలం సాగుపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమీక్ష చేసి కాళేశ్వరం జలాలపై ప్రకటన చేయడంతో పాటు పంటల మార్పిడిపై రైతులను సన్నద్ధం చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంతో పోల్చుకుంటే నేడు సాగు చేయాలంటే అన్నీ ఇబ్బందులే. ఈ వానకాలం సాగు సాగేట్టు కనిసిస్తలేదు. ఇప్పటికే దుక్కులు దున్నడం పూర్తి కావాల్సి ఉండగా వర్షాలు పడక.. సాగర్‌లో నీళ్లు లేక భయంతో డీజిల్ ఖర్చు వేస్ట్ అవుద్దని దుక్కులు దున్నడం లేదు. ఒకవేళ ప్రభుత్వం కేసీఆర్ మాదిరి ఉన్న భూమి మొత్తానికి రైతు భరోసా ఇచ్చినా ధైర్యంతో దుక్కులు దున్ని సిద్ధం చేసుకునేటోళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెట్టుబడి సాయం విడుదల చేసి రైతులకు మనోధైర్యం నింపాలి.
-పోరెడ్డి నాగేందర్‌రెడ్డి, రైతు, పాత నేరేడుచర్ల
నాకు 8 ఎకరాల భూమి ఉంది. గతంలో ఆరు ఎకరాలు సాగు చేసిన. ప్రస్తుతం సాగు చేద్దామంటే వర్షాలు సరిగ్గా రాక చెరువులు, కుంటల్లో చుక్క నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు ఆరుద్ర, రోహిణి కార్తెలు అయిపోయాయి. ఇంత వరకు ఇలాంటి కాలాన్ని చూడలేదు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పడం కాదు.. రైతే వెన్నెముక అన్నవారు నేడు రైతు వెన్ను విరిచే పరిస్థితి దాపురించింది. నారు పోద్దామంటే వర్షాలు లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు పుష్కలంగా రెండు పంటలకు సరిపోను పారాయి. కేసీఆర్ హయాంలో రైతులు నారు పోయడానికి ఆందోళన చెందలేదు. యాసంగి, వానకాలంలో చెరువులు, కుంటల్లో పుష్కలంగా కాలేశ్వరం జలాలు వచ్చినయి. ఇప్పటి ప్రభుత్వం రైతులకు సమయానికి నీళ్లు ఇవ్వకుండా గోస పెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లులేని కబోదిగా ఉండకుండా కాలేశ్వరం జలాలను తీసుకొచ్చి కాల్వల ద్వారా పంటలకు నీరందించి రైతులను ఆదుకోవాలి. కాలం ఇలాగే ఉంటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారు.
-సోమిరెడ్డి వీరారెడ్డి, రైతు, ఆత్మకూర్.ఎస్