KTR | నల్లగొండ, మార్చి 26 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేటీఆర్‌తో పాటు సోషల్‌మీడియా ఇంచార్జిలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై కేసులు నమోదు చేశారు.
నకిరేకల్ పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం లేకున్నా సోషల్‌మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్ వేర్వేరుగా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పేపర్ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 85/2025 నమోదు చేశారు. ఇందులో ఏ 1గా మన్నె క్రిశాంక్, ఏ 2 గా కేటీఆర్, ఏ 3గా కొణతం దిలీప్ కుమార్‌లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఉగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 86/2025 ను నమోదు చేశారు. ఇందులో ఏ1 గా కొణతం దిలీప్ కుమార్ , ఏ2గా మన్నే క్రిశాంక్, ఏ 3గా కేటీఆర్, ఏ4 గా తెలుగు స్క్రైబ్ ఎండీ, ఏ5 గా మిర్రర్ టీవీ యూట్యూబ్ ఛానెల్ ఎండీతో పాటు మరికొందరిపైనా రెండు కేసుల్లోనూ 353(1)(c), 353(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు.
ఇక పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతో పాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మైనర్ బాలునితో పాట ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది స్థానిక కాంగ్రెస్ నేతల అనుచరులేనన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు పలు సందర్భాల్లో అధికార పార్టీ ప్రముఖులతో సన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు, దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ వీటన్నింటిని పక్కన పెట్టి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది.