చౌటుప్పల్, జనవరి 23 : గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహేశ్వరం ఎస్ఓటీ బృందం, చౌటుప్పల్ పోలీసులు కలిసి సోమవారం రాత్రి పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. వారి వద్ద రూ.27.70లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ సీఐ ఎస్.దేవేందర్ మంగళవారం వాటి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజియాబాద్ జిల్లా సాహిబాబాద్ గ్రామానికి చెందిన మహ్మద్ రాయిస్ హాఫ్రిద్ రిక్షా పుల్లర్‌గా(ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వ్యాపారం) పనిచేసే వాడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా కుడారి గ్రామానికి చెందిన డ్రైవర్ మిథ్లేస్ సింగ్‌తో కలిసి వ్యాపారం చేసేవాడు. వీరికి న్యూ ఢిల్లీ చెందిన ఓ డ్రగ్స్ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. అతడు గంజాయిని రవాణా చేస్తే భారీగా నగదు అందజేస్తానని వీరికి హామీ ఇచ్చాడు. అతడి సూచనల మేరకు ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా న్యూఢిల్లీకి తరలిచేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు పక్కా సమాచారంతో మార్గమధ్యంలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద వీరిని పట్టుకున్నారు. వారి వద్ద రూ.27.70 లక్షల విలువైన 90 కిలోల గంజాయిని, కారును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా వీరు ఈ డ్రగ్స్ అక్రమ రవాణా చేసినట్లు ఒప్పుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.