రామగిరి, ఏప్రిల్ 14 : టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏప్రిల్ 13 న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీలో పని చేసినటువంటి జిల్లా సీనియర్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల భాగంగానే సంఘాలు ఏర్పడ్డాయని క్యాడర్ల వారిగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల నుండి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అన్ని కేడర్ల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే 13 ఏప్రిల్ 2014న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నుండి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు జరిగిందన్నారు. గత ఉపాధ్యాయ ఉద్యమాలతో పోల్చినప్పుడు ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయ ఉద్యమాన్ని విస్తృత పరిచి సమస్యల సాధన కోసం అందరూ ఏకం కావాలన్నారు. గత నాయకుల త్యాగాలు వారి ఉద్యమ ఫలాలను నేడు ఉపాధ్యాయ లోకం అనుభవిస్తుందని, ఆ పాత తరం నాయకులను వారి ఉపాధ్యాయ ఉద్యమాన్ని, అనుభవాలు గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించడం నేటి యువతరం ఉపాధ్యాయ నాయకులకు అభినందనీయమన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. అంబేద్కర్ చదువు- సమీకరించు – పోరాటం అనే నినాదాలకు అనుగుణంగా అధ్యయనం – అధ్యాపనం – సామాజిక స్పృహ లక్ష్యాలుగా హక్కులు – బాధ్యతలు రెండు నేత్రాలుగా 43 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో 13 ఏప్రిల్, 2014లో అలుగుబెల్లి నర్సిరెడ్డి అధ్యక్షుడు, చావ రవి ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు జరిగిందన్నారు. టీఎస్ యుటిఎఫ్ ఆశయ సాధనలో విధాన పత్రాన్నికి అనుగుణంగా 20 వేల సభ్యత నుండి నేడు 40 వేల పైగా సభ్యత్వాన్ని పొంది 50 వేల సభ్యత్వం వైపు దిశగా వెళుతూ నేడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం పాలించే వారిని బట్టి ఉంటుందని రాజ్యాంగం విఫలమైతే అది పాలకుల తప్పే తప్ప రాజ్యాంగ లోపం కాదన్నారు. నేడు రాజ్యాంగ ప్రకారం ఎన్నికై ప్రమాణాలు చేసిన కొందరు రాజ్యాంగ విరుద్ధంగా లౌకికత్వం, సమానత్వానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. సర్ అమలు పరుస్తూ అర్హులైన భారత పౌరుల ఓట్లు కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. సామాజిక స్పృహ గల ఉపాధ్యాయ సంఘం గా బడుగు, బలహీన వర్గాల వారి రక్షణ కోసం పీడిత వర్గాల అభ్యున్నతి కోసం వారికి రాజ్యాంగ హక్కులు అందే విధంగా టీఎస్ యూటీఎఫ్ కృషి చేస్తుందని తెలిపారు.
నేటి రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టో పెట్టిన విధంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రిటర్మెంట్ అయిన వారి బిల్లులను, పెండింగ్ బిల్లులను ఏక మొత్తంగా చెల్లించాలని, పిఆర్సి అమలు జరిపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జేఏసీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 17న నల్ల రిబ్బన్లతో నిరసన, మే 5న జిల్లాస్థాయిలో నిరసన జరిపి మే 14న తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అవసరమైతే పెన్ డౌన్, సమ్మెకైనా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాప్రా రాష్ట్ర అధ్యక్షుడు పి.కృష్ణమూర్తి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, సొంబాబు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సిహెచ్ రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు వి.బంగారయ్య, పి.నాగరాజ్జున, కుకడాల గోవర్ధన్, కె.గోవర్ధన్, శాంతి కుమార్, నర్రా సరళ, సుభాషిణి, పద్మ, అరుణ, వేదశ్రీ, టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శులు, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.