టీఎస్ ఆర్టీసీ గాడినపడ్డది. నష్టాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన సంస్థ కుదుటపడింది. కరోనా మహమ్మారి దెబ్బ నుంచి కోలుకొని మంచి ఆదాయాన్ని గడిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి తోడు కార్మికుల కష్టంతో లాభాల బాట పట్టింది. టికెట్ ధరలు పెంచకుండా ఇన్కంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక కార్యాచరణతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడుకు ఏడు డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ప్రజల నుంచి కూడా ఆర్టీసీకి మంచి ఆదరణ లభిస్తున్నది. నల్లగొండ రీజియన్ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో 83శాతం నమోదైంది. రోజువారీ కలెక్షన్ కూడా రూ. 80 లక్షల నుంచి రూ. 1.10 కోట్లకు పెరిగింది. రీజియన్ లాభాల బాటపై ఆర్టీసీ అధికారులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 14 (నమస్తే తెలంగాణ) : నష్టాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన టీఎస్ఆర్టీసీ లాభాల బాట పట్టింది. కరోనా కంటే ముందు ఆర్టీసీలో సాధారణ పరిస్థితులు ఉండేవి. కరోనా తర్వాత ఒక్కసారిగా సంస్థకు కోలుకోలేని దెబ్బపడింది. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతోపాటు జనం ప్రయాణించేందుకు ఆసక్తి చూపకపోవడంతో నష్టాలపాలైంది. ఆ తర్వాత క్రమక్రమంగా సంస్థ కోలుకుంటూ వస్తున్నది. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతున్నది. రాష్ట్ర బడ్జెట్లో వరుసగా ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించి.. సంస్థకు మద్దతుగా నిలిచింది. దీనికితోడు ఉన్నతాధికారుల ప్రత్యేక కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్మికుల కష్టంతో నష్టాల నుంచి లాభాల స్థాయికి చేరుకుంటున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోలు ఉండగా.. అన్ని డిపోల్లో కలిపి మొత్తం 645 బస్సులు నడుస్తున్నాయి. నిత్యం లక్షల మందిని సురక్షితంగా తమ గమ్యాలకు చేరుస్తున్నాయి. అయితే.. గతంలో నష్టాలు చవిచూసిన ఏడు డిపోలు ఇటీవల లాభాల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నార్కట్పల్లి, నల్లగొండ, దేవరకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట డిపో లాభాల్లో ఉన్నాయి. సాధారణంగా మిర్యాలగూడ, దేవరకొండ డిపోలు మాత్రమే లాభాల్లో ఉంటాయని, ఇప్పుడు ఏకంగా అన్ని డిపోలు మంచి ఆదాయాన్ని గడిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదే స్థాయిని కొనసాగించేందుకు, లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్లకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు.
రీజియన్ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో, రోజువారీ ఆదాయం పెరిగింది. గతంలో రోజువారీ ఆదాయం సగటున రూ.80లక్షలు మాత్రమే వచ్చేది. ఇప్పుడు నిత్యం సగటున రూ.1.10 కోట్ల కలెక్షన్ వస్తున్నదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా మంచిగా నమోదవుతున్నది. గతంలో 70నుంచి 75శాతం ఓఆర్ మాత్రమే నమోదు కాగా, ఇప్పుడు సగటున 83శాతం ఆక్కుపెన్సీ రేషియో రికార్డవుతున్నది. అత్యధికంగా యాదగిరిగుట్ట, దేవరకొండ డిపోల్లో 85శాతం ఓఆర్ నమోదైంది.
ఆర్టీసీ డిపోలు ప్రత్యేక ప్రణాళికతోనే లాభాల్లోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల వరుసగా పెండ్లిళ్లు, ఇతర కార్యాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతేకాకుండా సంస్థ నుంచి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇటీవల 100 రోజుల ప్రాఫిట్ ఛాలెంజ్ ప్రణాళికను తీసుకొచ్చింది. వివాహాలు, యాత్రలు, ఇతర కార్యాలకు స్పెషల్ ఆఫర్లతో బస్సులను అద్దెకు ఇస్తున్నది. టికెట్లపై రాయితీలు ప్రకటించింది. ఆర్టీసీ కార్గోను తీసుకొచ్చి విజయవంతంగా కొనసాగిస్తున్నది. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ప్రజలు ఆర్టీసీ వైపు మళ్లేందుకు గ్రామాల్లో అధికారులను నియమించింది. అవసరాన్ని బట్టి అదనపు సర్వీసులు నడుపుతున్నది.
ఆర్టీసీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. సంస్థపై ప్రయాణికులకు నమ్మకం ఉండటం వల్లే లాభాలు సాధ్యమవుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు రోజురోజుకూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ ఆర్టీసీకి మాత్రం ప్రజల ఆదరణ కొనసాగుతున్నది. రోజువారీగా ఆదాయం ఆశాజనకంగా ఉంటున్నది. నష్టాలు వీడి ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్నది. ఇది ఇలాగే కొనసాగాలంటే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో మరింతగా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉంటాయని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేరుస్తుందని వివరిస్తున్నారు.