తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్… నేడు దేశ రాజకీయాల్లో సమూల మార్పుల కోసం బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 22వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్దమైంది. ఇన్నేండ్ల ప్రస్థానంలో 13 ఏండ్లు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత తొమ్మిదేండ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు, అభివృద్ధి నమూనాకు వేదికగా నిలిచింది. ఉద్యమ కాలంలో నినాదాలుగా ఉన్న ఎన్నో సమస్యలకు ప్రభుత్వంగా పరిష్కారం చూపుతూ ప్రజల మనస్సు గెలుచుకున్నది. అభివృద్ది, సంక్షేమానికి కొత్త భాష్యం చెప్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు పార్టీ ప్రస్థానంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నది. నాడు ఉద్యమ కాలంలో అయినా, నేడు స్వపరిపాలనలో అయినా జనం గులాబీ జెండాకే జై కొడుతున్నది. పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు సీఎం కేసీఆర్ వెన్నంటి ఉన్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారధ్యంలో బీఆర్ఎస్ 12కు 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఆనాడు టీఆర్ఎస్కు తొలి గెలుపు సిద్దిపేట అందిస్తే… నేడు బీఆర్ఎస్కు మునుగోడు విజయ హారతి పట్టింది. బీఆర్ఎస్ ఏర్పాటు, ఆ వెంటనే మునుగోడులో తొలి విజయం అనంతరం జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం అవడంతో కీలక ఘట్టాలన్నీ ప్రస్థావనకు వస్తున్నాయి. మరోవైపు గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్న రాష్ట్ర ప్లీనరీకి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధులు తరలివెళ్లనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 6 లక్షల మంది పార్టీ సభ్యులతో ఎదురులేని శక్తిగా బీఆర్ఎస్ నిలిచింది. సంస్థాగత నిర్మాణ పరంగా పటిష్టమైన పార్టీగా అగ్రభాగంలో ఉంది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఆవాసా ప్రాంతానికి, మారుమూల తండాకు, ప్రతి బస్తీ గల్లీకి సైతం గులాబీ పార్టీ విస్తరించింది. ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం పార్టీ లేని ఏరియా లేదంటే అతిశయోక్తి కాదు. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో మొదలైన విజయపరంపర నిన్న మొన్నటి మునుగోడు ఉప ఎన్నికల వరకు అప్రతిహతంగా సాగుతూ వస్తున్నది.
అన్ని ఎన్నికల్లోనూ విజయం
2014లో ఆరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానంతో బోణీ కొట్టిన పార్టీ నేడు జిల్లాను సంపూర్ణం చేసింది. 2018 ఎన్నికల్లోనూ 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపొంది చరిత్ర సృష్టించింది. తర్వాత ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చిన మూడు ఉప ఎన్నికల్లోనూ విజయపతాకం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన హుజూర్నగర్, మునుగోడుతోపాటు నాగార్జునసాగర్‌లోనూ విజయఢంకా మోగించింది. దాంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న మొట్ట మొదటి పార్టీగా బీఆర్ఎస్ ఎవ్వరికీ సాధ్యం విజయాల రికార్డులను సొంత చేసుకుంది.
బీఆర్ఎస్గా రూపాంతరం చెందాక మునుగోడు ఉప ఎన్నికల్లో తొలి విజయం అందించి బీఆర్ఎస్ పార్టీగా దేశ రాజకీయాల్లో ఘనమైన ఎంట్రీ ఇచ్చేలా జిల్లా ప్రజలు మరోసారి తమదైన మద్దతును ప్రకటించడం విశేషం. 2014 ఎన్నికల సమయంలోనూ సూర్యాపేట గడ్డ మీద జరిగిన సమరభేరి సభ అధికారం వైపు అడుగులు వేసేలా అంతులేని ఆత్మవిశ్వాసం కల్పించిన విషయం తెలిసిందే. ఇలా ఉద్యమకాలంతో పాటు స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలువడంలో నల్లగొండ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుతూ వస్తున్నది. ఇక సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే క్రమంలోనూ నల్లగొండ ఎప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నారు. ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు హైలెట్‌గా నిలిచాయి. ప్రతి నియోజకవర్గంలో 3వేల మందికి తగ్గకుండా పార్టీ క్రియాశీలక సభ్యులంతా వీటిల్లో పాల్గొని పార్టీ పట్ల నిబద్ధ్దతను చాటారు. అంతకు ముందు వాడవాడలా పార్టీ జెండాలను ఎగురవేసి అంతటా పండుగ వాతావరణాన్ని తలపించారు. ఉద్యమ గుర్తులపై, అభివృద్ధ్ది సంక్షేమ పథకాలపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై, భవిష్యత్తు కర్తవ్యాలపై చేసిన తీర్మానాల్లో పార్టీ శ్రేణులంతా భాగస్వాములయ్యారు. దీంతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో మరింత స్ఫూర్తిని నింపినైట్లెంది. ఇదే తరుణంలో నేడు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్లీనరీకి సర్వం సిద్ధ్దమైంది. జిల్లా నుంచి కూడా ఎంపిక చేసిన ప్రతినిధులు తరలివెళ్లనున్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో…
నేడు తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించనున్న రాష్ట్ర ప్లీనరీకి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధులు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి ప్రతినిధులను ఎంపిక చేసి జాబితాను పంపించారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ నేతలంతా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర ప్లీనరీలో పాల్గొననున్నారు. వీరంతా ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. ప్లీనరీలో పార్టీ పతాక ఆవిష్కరణ అనంతరం అధినేత కేసీఆర్ ప్రసంగం, అంశాల వారీగా తీర్మానాలు ఉండనున్నట్లు తెలిసింది.