భువనగిరి అర్బన్, నవంబర్ 4 : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్తో వామపక్ష పార్టీలు కసితో పని చేయడంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 30వేల మెజార్టీతో గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వామపక్ష నాయకులతో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో బీజేపీని గెలిపించేందుకు కేంద్రం నుంచి ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు విశ్వసించలేదన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చి ఎనిమిదిన్నరేండ్లు గడుస్తున్నా దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
దేశ సంపదను ప్రైవేట్‌పరం చేయడంతో పాటు, విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపారని విమర్శించారు. గతంలో మునుగోడులో గెలిచిన రాజగోపాల్‌రెడ్డి ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలు లేవన్నారు. మునుగోడు అభివృద్ధికే రాజీనామా చేశానని రాజగోపాల్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ ఫ్రంట్‌కు మద్దతు
సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు
బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న ఫ్రంట్‌కు వామపక్షాల మద్దతు ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో మద్దుతు తెలిపామని, వామపక్ష నాయకులను మమేకం చేసి కూసుకుంట్లకు ఓట్లు వేయించి బీజేపీని ఓడించేందుకు కృషి చేశామన్నారు.
సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ.కిరణ్‌కుమార్, జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, వామపక్ష నాయకులు కొండమడుగు నర్సింహ, ఏశాల అశోక్, ఎండీ.ఇమ్రాన్, దయ్యాల నర్సింహ పాల్గొన్నారు.