రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం గిరిజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తండాల్లో సంప్రదాయ వేషధారణతో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బ్రోచర్లను విడుదల చేశారు. తొమ్మిదేండ్ల ప్రగతిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవరకొండ, కొండమల్లేపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి.. మిర్యాలగూడ మండలం లావూరి తండాలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.. అనుముల మండలం వీర్లగడ్డతండాలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.. కోదాడ మండలం దూదియా తండాలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, గరిడేపల్లి మండలం రేగులగడ్డ తండాలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నారాయణపురం మండలం వాచ్యతండాలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, చివ్వెంల మండలం జయరాం గుడి తండాలో కలెక్టర్ వెంకట్రావ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం, జూన్ 17 : గిరిజనుల సమగ్రాభివృద్ధే రాష్ట్ర సర్కారు లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పిల్లిగుండ్ల తండాలో శనివారం నిర్వహించిన గిరిజనోత్సవంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి, గిరిజనుకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. జిల్లాలో 500 జనాభా ఉన్న 37 తండాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా మార్చి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పంచాయతీలుగా మారిన తండాలు అభివృద్ధిలో ఇతర గ్రామాలతో పోటీ పడుతున్నాయన్నారు. గిరిజన విద్యార్థుల కోసం జిల్లాలో 8ఎస్టీ హాస్టళ్లను ఏర్పాటు చేసి 774 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రైకార్ కింద గిరిజనులకు రూ.6.04 కోట్లు సబ్సిడీ లోన్లు మంజూరు చేశామని, 34 గిరిజన గ్రామపంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయని చెప్పారు.
మిషన్ భగీరథతో తండాల్లో మంచినీటి కష్టాలు తీరాయన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా జడ్ రొనాల్డ్, కలెక్టర్ పమేలా సత్పతి, డీఆర్డీఓ నాగిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బిక్కునాయక్, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, సర్పంచ్ మోతీ మున్యా, ఎంపీటీసీ కుర్మిండ్ల అనితకావ్య, తాసీల్దార్ పద్మ సుందరి, మండల ప్రత్యేకాధికారి జ్యోతికుమార్, ఎంపీడీఓ సరిత, నాయకులు కుషంగల సత్యనారాయణ, ఈశ్వర్‌గౌడ్, గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తండాల అభివృద్ధికే ప్రత్యేక పంచాయతీలు
గరిడేపల్లి, జూన్ 17 : తండాలను అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని రేగులగడ్డ తండాలో శనివారం నిర్వహించిన గిరిజనోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని భోగ్‌బండార్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తండాలు అభివృద్ధికి నోచుకోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తండా సర్పంచ్ బానోతు ఉషావెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రాములునాయక్, ఉప సర్సంచ్ జ్యోతి, సెక్రటరీ జానకి, నాయకులు కడియం వెంకట్‌రెడ్డి, వెంకటమ్మ, కౌసల్య, తులసియా, నర్సయ్య, వెంకటాద్రి, దుర్గయ్య, నారాయణ, దూదియా తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే తండాల్లో కొత్త వెలుగులు
చిలుకూరు, జూన్ 17 : దశాబ్దాలపాటు అణిచివేతకు గురైన గిరిజనులకు బీఆర్ఆస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, స్వరాష్ట్రంలోనే తండాల్లో కొత్త వెలుగులు వచ్చాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండలంలోని దూదియాతండాలో శనివారం జరిగిన గిరిజనోత్సవంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి పాలనలో నూతన ఒరవడులు సృష్టించారని తెలిపారు. గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మించారని, సంత్ సేవాలాల్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆశ కార్యకర్తలు, పొదుపు సంఘం, అంగన్వాడీ మహిళలను చీరె సారెతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు నందలాల్, మంగమ్మ, వాలి వెంకన్న, రవీందర్, ఎంపీటీసీలు కృష్ణచైతన్య, బెల్లంకొండ రమణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొండా సైదయ్య, నాయకులు సురేశ్‌బాబు, అజయ్‌కుమార్, శివాజీనాయక్, జనార్దన్, సైదులు పాల్గొన్నారు.
గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్
సంస్థాన్ నారాయణపురం, జూన్ 17 : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన గిరిజన బాంధవుడు అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వాచ్యతండాలో శనివారం నిర్వహించిన గిరిజనోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 250 మంది ఓటర్లున్న వాచ్య తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి తండాలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మండల వ్యాప్తంగా 13 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఒక్కో తండాలో రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించామని తెలిపారు. రూ.11 కోట్లతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. రూ.50 కోట్లతో తండాల అభివృద్ధికి ప్రణాళికలు రచించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మండల కేంద్రంలో రూ.2కోట్లతో సంత్ సేవాలాల్ భవనం నిర్మిస్తామన్నారు.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అనంతరం వాచ్యతండా నుంచి జనగాం గ్రామం వరకు రూ.3కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే వారితో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, వైస్ ఎంపీపీ రాజు, సర్పంచులు దోనూరి జైపాల్‌రెడ్డి, దేవీలాల్, కురిమిద్దె కళమ్మ, శ్రీను, రాజు, సుర్వి యాదయ్య, ఎంపీటీసీలు శివరాత్రి కవిత, కరంటోతు విజయ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, అధికారులు పాల్గొన్నారు.
గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
దేవరకొండ, జూన్ 17 : గిరిజనుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తూ వారికి పాలనాధికారం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలో శనివారం గిరిజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మీనాక్షి హోటల్ నుంచి సాయిరమ్య ఫంక్షన్‌హాల్ వరకు గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కొండమల్లేపల్లి మండలంలోని గుర్రంపుతండాలో గిరిజనోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలకు కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డితోపాటు ఎమ్మెల్యే, ట్రైకార్ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రకుమార్, రాంచందర్‌నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు.
దశాబ్దాలుగా అణిచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మగౌవరంతో బతికేలా చేశారని పేర్కొన్నారు. గిరిజనుల గడపగడపకూ సంక్షేమం, కొత్త పంచాయతీల్లో ప్రగతి, ఇళ్లల్లో పరవళ్లు తొక్కే జల దృశ్యాలు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర రాజధానిలో సేవాలాల్ మహారాజ్ భవనం నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 3600 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేశారని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఒ గోపీరాం, ఎంపీపీలు బాణావత్ పద్మ, మాధవరం సునీత, జడ్పీటీసీ కేతావత్ బాలూనాయక్, పీఏసీఎస్ చైర్మన్లు ముక్కమాల బాలయ్య, తూం నాగార్జున్‌రెడ్డి, ఏటీడీఎఓ రాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, రమావత్ దస్రూనాయక్, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తండాల్లో అభివృద్ధి పరుగులు
Nalgonda2
మిర్యాలగూడ రూరల్, జూన్ 17 : బీఆర్ఎస్ పాలనలో గిరిజన తండాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని లావూరితండాలో శనివారం జరిగిన గిరిజనోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పెద్ద తండాలు సైతం మేజర్ గ్రామ పంచాయతీ కింద కొనసాగాయని, దాంతో అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నియోజకవర్గంలో 38 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయని, దాంతో గిరిజన యువకులు సర్పంచులుగా ఎన్నికై తమ తండాలను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. సుమారు రూ.30 కోట్ల ఎస్టీఎస్ఢీఎఫ్ నిధులు ఖర్చు చేసి నియోజకవర్గంలోని అన్ని తండాల్లో సీసీ రోడ్లు వేశామన్నారు. మిర్యాలగూడలో కోటి రూపాయలతో సంత్ సేవాలాల్ భవనాన్ని నిర్మించుకుంటున్నామని తెలిపారు.
ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధ్దికి పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వేల ఎకరాల పోడు భూములను గిరిజనులకు అప్పగించే యత్నం చేస్తున్నదన్నారు. అనంతరం తండాలో నూతనంగా నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ధీరావత్, దుబ్బంతండాల్లో గిరిజన పండుగలో పాల్గొని గ్రామస్తులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీపీ నూకల సరళ, సర్పంచులు లావూడి చావళి, వెంకటేశ్వర్లు, మాలోతు అంజమ్మ, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీఓ వీరారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదయ్య యాదవ్, నాయకులు ఏడుకొండల్, చిట్టిబాబు నాయక్ పాల్గొన్నారు.
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
గుర్రంపోడు, జూన్ 17 : తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మండలంలోని తేనేపల్లితండా, ఘాసీరాంతండాలో శనివారం నిర్వహించిన గిరిజనోత్సవంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు తమ తండాలను తాము పరిపాలించుకునే విధంగా గ్రామ పంచాయతీలుగా మార్చారన్నారు. గత కాంగ్రెస్ పాలకులు ఏనాడూ ఈ ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 56 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, హైదరాబాద్‌లో గిరిజన భవనాల నిర్మాణం, పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
అనంతరం తేనేపల్లి తండాలో కొత్త గ్రామపంచాయతీ భవనం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు గిరిజనులు కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి, ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, సర్పంచులు వడిత్య రజిత, మెగావత్ బిక్కీ, చాడ చక్రవర్తి, వాడపల్లి రంగమ్మ, కామళ్ల రేవతి, ఎంపీటీసీ గట్టుపల్లి రంగమ్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్‌రావు, నాయకులు రవి ముదిరాజ్, వెంకట్‌రెడ్డి, లింగయ్య, నర్సింహ, శ్రీను పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలో మారిన గిరిజన బతుకులు
చివ్వెంల, జూన్ 17 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక గిరిజనుల బతుకుల్లో పెద్ద మార్పు వచ్చిందని, ఇప్పుడు తండాల్లో ప్రజలకు సమాన అవకాశాలు వస్తున్నాయని, అందుకు నిదర్శనంగా గిరిజనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మండలంలోని జయరాంగుడితండాలో జరిగిన ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం గిరిజన రిజర్వేషన్లు 6నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. తండాల్లో విద్యకు నోచుకోని వారి కోసం జిల్లాలో 4గిరిజన గురుకుల పాఠశాలలు, ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే చదువు ఎంతో అవసరమని, పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్, జడ్పీ సీఈఓ సురేశ్, ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, సర్పంచ్ సుశీలపంతులు, తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.