కట్టంగూర్, ఆగస్టు 5: వర్షం పడితే చాలు..కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్, అంబటివాగు, రాంనగర్ ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. మండల కేంద్రానికి నిత్యం సాఫీగా సాగే ప్రయాణం ఒక్కసారిగా నిలిచిపోతోంది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తే ఆయా ప్రాం తాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల ఇబ్బందులు వర్ణనాతీతం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడేండ్ల క్రితం హైస్కూల్, గ్రామ పంచాయతీ సమీపంలో హైలెవల్ వంతెనల ఏర్పాటుకు రూ.4 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రతి సంవత్సరం వానకాలంలో ఈ ప్రాంత ప్రజలకు నరకం కనిపిస్తోంది.
శంకుస్థాపనకే పరిమితం..
ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైస్కూల్, గ్రామ పంచాయతీ సమీపంలోని పెద్దవాగుపై ఒక్కో హైలెవల్ వంతెన నిర్మాణానానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ.4 కోట్లతో 2023 అక్టోబర్ 4న అప్పటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. తమ కష్టాలు తీరుతాయని పరిసర ప్రాంత ప్రజలు సంబురపడ్డారు. అయితే తీరా పనులు మొదలయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. అనంతం నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో శంకుస్థాపన చేసిన శిలాఫలకం మాత్రం కనిపిస్తోంది.

ప్రతి సంవత్సరం ప్రాణసంకటమే
వర్షాలు కురిసిన ప్రతిసారీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జనం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. అంబేద్కర్ నగర్, అంబటి వాగు, రాంనగర్ ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు చెప్పనలవికాదు. మరోవైపు జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ప్రయాణించాల్సి రావడంతో ముప్పు వెంటాడుతోంది. గ్రామ పంచాయతీ, ఎంపీడీవో, తాసీల్దార్ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే అర్జీదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొటున్నారు.
వంతెన నిర్మించాలి..
పెద్దవాగుపై వంతెనలు లేకపోవడంతో విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణం కాలనీ ప్రజల కలగానే మిగిలింది. వర్షాకాలంలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తే వివిధ పనులకు మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో మా కష్టాలు తీరుతాయని సంబురపడ్డాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలి.
-మేడి రాములు, అంబేద్కర్‌నగర్ కాలనీ