వలిగొండ, నవంబర్ 1 : పండుగ పూట సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడి మృతిచెందారు. ఈ విషాధ ఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జంగాల కాలనీకి చెందిన అన్నదమ్ముల పిల్లలు కళ్లెం కిరణ్ (11) 5వ తరగతి, కళ్లెం జీవన్ (13) 6వ తరగతి చదువుతున్నారు. వీరితోపాటు కళ్లెం వరుణ్ గురువారం సమీపంలోని మూసీ నదిలో చేపలు పట్టడానికి వెళ్లారు. మూసీ నది ఒడ్డున ఉండి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి కిరణ్ నీళ్లల్లో పడ్డాడు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కిరణ్‌ను రక్షించడానికి జీవన్ నీళ్లలోకి దూకాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో వారు మునిగి పోతుండగా వరుణ్ గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి కుటుంబ సభ్యులకు, కాలనీ వాసులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని రక్షించే ప్రయత్నం చేసినటప్పటికీ ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వెతికారు.
కిరణ్ మృతదేహం లభ్యం కాగా.. జీవన్ ఆచూకీ లభించలేదు. దాంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టగా ప్రమాదం జరిగిన కొంత దూరంలో శుక్రవారం జీవన్ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ కోసం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో వలిగొండలో విషాధ చాయలు అలుముకున్నాయి.