మునుగోడు, మార్చి 24 : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మునుగోడు మండల 11వ మహాసభలో అయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు నేడు సమస్యల నిలయంగా మారిందన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని తెలిపారు.
గత కొన్ని నెలలుగా కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆన్లైన్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆన్లైన్ అప్డేట్ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ అప్డేట్ పేరుతో గత ఆరు నెలలుగా కార్మికులను ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావాల్సిన సెస్సు సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదన్నారు. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మెడికల్ చెకప్ ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు చాపల శ్రీను, మండల కార్యదర్శి దుబ్బ వెంకన్న, కార్యదర్శి బెల్లం శివయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఈధ యాదయ్య, పందుల పెద నరసింహ, మేకల కృష్ణయ్య, ఈద రాములు, జీడిమడ శీను, పందుల మారయ్య, ఏరుకొండ నాగేశ్, యాసరాని వెంకన్న, దొమ్మాటి గిరి, భీమనపల్లి స్వామి, బండారి శంకర్ మాలాద్రి , చిన్న నరసింహ పాల్గొన్నారు.