నేరేడుచర్ల, జూన్ 28 : నేరేడుచర్ల మున్సిపాలిటీలో వ్యాపారం చేసుకునే దుకాణ నిర్వహకులు తప్పనిసరిగా ట్రైడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని పలు దుకాణాలను మున్సిపల్ సిబ్బంది పొడవు, వెడల్పు కోలతలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాలను నిర్వహిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి దుకాణంను కొలతలు వేసిన అనంతరం ఆన్లైన్లో నమోదు చేసి ట్రేడ్ లైసెన్స్ ఇస్తామని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ కోసం ఆధార్ కార్డు, దుకాణం ఫొటో, ఇంటిపన్ను రషీద్‌ను తీసుకుని వచ్చి మున్సిపాలిటీలో సంప్రదించాలని, అనంతరం వాటిని పరిశీలించి ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేస్తామని పేర్కొన్నారు.