నల్లగొండ, ఆగస్టు 17 : నల్లగొండ పట్టణానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్ ఇసుక బుక్ చేశాడు. వెంటనే అతనికి సక్సెస్ఫుల్ బుకింగ్ అంటూ ట్రాక్టర్ నెంబర్‌తో పాటు డ్రైవర్ నెంబర్‌తో కూడిన మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత బు కింగ్ క్యాన్సిల్ అయినట్లు మరో మెసేజ్ రావటంతో సదరు ట్రాక్టర్ డ్రైవర్‌కు కాల్ చేయగా తాను రాలేకనే క్యాన్సిల్ చేశానని సమాధానం ఇచ్చాడు. అయితే సదరు డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే మరో డ్రైవర్‌కు ఫార్వర్డ్ చేయాల్సి ఉండగా అదీ జరగలేదు. దీంతో ఆయన మైనింగ్ అధికారులతో పాటు స్థానిక తాసీల్దార్, ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఆ తర్వాత ఆరా తీస్తే ఆన్లైన్లో ఇసుక ఇవ్వటం కష్టం, ఆఫ్‌లైన్‌లో తీసుకోమని ఒకరు సలహా ఇవ్వడంతో రూ.4వేలతో ట్రాక్టర్ ఇసుకను కొన్నాడు. ఇక దేవరకొండ రోడ్డులోని జానయ్య అనే వ్యక్తి సైతం ఈ నెల 2వ తేదీన ఇసుక బుక్ చేస్తే ఆన్లైన్లో బుక్ అయినట్టు మెసేజ్ వచ్చింది కానీ ఇసుక రాకపోవటంతో మైనింగ్ అధికారులను కలిసి వత్తిడి చేయడంతో మరునాడు ఇసుక వచ్చింది. అయితే అది నాణ్యంగా లేకపోవడమే కాకుండా అందులో బురద, రాళ్లు ఉన్నాయి. దాంతో ఆయన ఆన్లైన్ జోలికి వెళ్లకుండా ఆఫ్‌లైన్‌లోనే కొన్నాడు. ఆన్లైన్లో ట్రిప్పుకు రూ.2900 చెల్లించిన ఆయన ఆఫ్‌లైన్‌లో నాణ్యమైన ఇసుకకు రూ.3900 చెల్లించినట్లు చెప్పాడు.
నల్లగొండ నియోజక వర్గంలోని కనగల్, లింగో టం, తిమ్మన్న గూడెం, దోరెపల్లి, పగిడిమర్రి, రేగట్టె, మదనాపురం, నల్లగొండ మండలంలోని నర్సింగ్‌బట్ల గ్రామాల నుంచి నల్లగొండ పట్టణానికి ఇసుకను ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి మైనింగ్ శాఖ అధికారులు ఇసుక సరఫరా చేస్తున్నారు. అయితే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.2900 కాగా ఆఫ్‌లైన్‌లో అయితే రూ.4వేల దాక అవుతోంది. రూ. 2900కు లభించే ఆన్లైన్ ఇసుకలో క్వాలిటీ లేకపోగా ఆఫ్‌లైన్‌లో వచ్చే ఇసుకకు రూ. 4వేలు తీసుకుంటూ క్వాలిటీ ఇసుక ఇస్తున్నారు. దీంతో చాలామంది ఇంటి నిర్మాణదారులు ఒకటీ రెండు ట్రిప్పులు మొదటగా ఆన్లైన్లో బుక్‌చేసి ఆ తర్వాత క్వాలిటీ లేకపోవటంతో మళ్లీ ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసి రూ.3600 నుంచి రూ.4వేల వరకు చెల్లిస్తున్నారు.
ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికి ఆ ఇసుకను ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తూ కాసులు సంపాదిస్తున్న ఈ కేటుగాళ్లు సంబంధిత శాఖల అధికారులను అవే కాసులతో మేనేజ్ చేస్తున్నా రు. ప్రధానంగా క్షేత్ర స్థ్దాయిలో ఉన్న ఆయా గ్రామాల పోలీసు అధికారులకు పెద్ద వాటా ఇస్తూ, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల చేతులు సైతం తడిపి చక్కగా తమ దందా కొనసాగిస్తుండటం విశేషం. మరికొందరు ఆన్లైన్ చేయకుండానే రాత్రి వేళల్లో బ్లాక్‌లో విక్రయిస్తుండగా మరికొందరు ఆన్లైన్ పేరుతో ఓ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి దందా నడిపిస్తున్నారు.
నల్లగొండ, కనగల్ మండలాల్లోని ఆయా ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకొస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు గ్రామాల వారీగా సిండికేట్‌గా ఏర్పడ్డారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో వారికి అడ్డంకిగా ఉండే పోలీసులకు వాటా ఇచ్చి, ఆ తర్వాత రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారుల చేతులు తడిపి దందా నడిపిస్తున్నారు. గ్రామాల వారీగా ఉన్న డ్రైవర్లు వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల పేరుతో వారే చిరునామాలు క్రియేట్ చేసి ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తారు. ఈ ఇసుకను పారలతో క్వాలిటీ ఉన్న ఇసుక లిఫ్టింగ్ చేసి, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఎలాగూ వారు తెలిసిన వారే కాబట్టి ఫోన్ నెంబర్, ఓటీపీ సమస్య లేకుండా చూసుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ల ఇసుకను క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. వత్తిడి చేస్తే జేసీబీతో నాణ్యతలేని ఇసుకను సరఫరా చేస్తూ కాసుల దందా చేస్తున్నారు.