యాదగిరిగుట్ట, మే 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంతకు ఈ నెల 15న మిస్ వరల్డ్ కాంటెస్ట్‌లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5నుంచి 7గంటల వరకు స్వామివారిని దర్శించుకుంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనను ప్రశాంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లను పరిశీలించి దేవస్థాన అధికారులతో సమీక్ష జరిపి పలు సూచనలు చేశారు.
దర్శనానికి వచ్చే అతిథులకు ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా చూడాలన్నారు. అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 2గంటల పర్యటనలో కొండపైన వీవీఐపీ అతిథి గృహం నుంచి అఖండ దీపారాధనలో పాల్గొని, తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థాన టూరిజానికి ఇది మంచి అవకాశమన్నారు. ఈ పర్యటనతో యాదగిరిగుట్ట ఆలయం ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ ఈఓ వెంకట్రావు, డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ, ఈఈలు రామారావు, దయాకర్‌రెడ్డి, ఇన్చార్జి తాసీల్దార్ దేశ్యా పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి : ఆధునిక వస్త్ర ప్రపంచంలో పోచంపల్లి ఇకత్ వస్త్రాలు ఫ్యాషన్ ైస్టెల్‌గా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది మారెట్ సదుపాయాలు పెరుగనున్నాయని, దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. టూరిజం శాఖ జీఎం ఉపేందర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునందతో కలిసి మంగళవారం గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. ప్రధాన ద్వారం స్వాగత తోరణాలు, స్టాల్ ఏర్పాట్లు, మ్యూజియం, మగ్గాల ప్రదర్శన, హంపి థియేటర్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న పోచంపల్లికి పది దేశాలకు చెందిన 25 మంది మిస్ వరల్డ్ పోటీదారులు రానున్నారని తెలిపారు. ఇకత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్ వాక్ నేతన్నలకు వరంగా మారనున్నదని తెలిపారు. కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ ఏడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఇన్చార్జి తాసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంపీడీఓ భాసర్గౌడ్, ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాసర్‌రెడ్డి, మండల వైద్యాధికారి శ్రీవాణి, ఈవెంట్ ప్రతినిధి సతీశ్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్‌కో ఏఈలు లింగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.