దేవరకొండ రూరల్, మార్చి 21 : తాటి చెట్టు పైనుండి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన దేవరకొండ రూరల్ మండలంలోని ముదిగొండ గ్రామంలో శనివారం జరిగింది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. ముదిగొండ గ్రామానికి చెందిన మారుపాకుల యాదయ్య గౌడ్ ప్రతిరోజు తాటి చెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం చెట్లు గీయడానికి వెళ్లిన యాదయ్య అకస్మాత్తుగా తాటి చెట్టు పైనుండి ఒక్కసారిగా కిందపడ్డాడు. దీంతో అతని కుడి, ఎడమ ప్రక్కటెముకలు, దవడ ఎముక విరిగింది. ఊపిరితిత్తులకు గాయం కావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు.