భువనగిరి అర్బన్, జూన్ 16 : త్యాగ నిరతికి, అల్లాహ్పై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ (ఈద్ ఉల్ ఆదా)ను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా సమీపంలో, పెద్ద చెరువు కట్ట సమీపంలోని ఈద్గాహ్లను సిద్ధం చేశారు. ముస్లింలు ఈద్గాహ్లకు వెళ్లి ఈద్ నమాజ్ చేయడంతోపాటు మత పెద్దలు, మౌలానాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకొంటారు. అనంతరం ఖబ్రస్థాన్లోని తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తారు.
బక్రీద్ సందర్భంగా తాహతు కలిగిన వారు పొట్టేళ్లను ఖుర్బానీ ఇస్తారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున మేకపోతులు, పొట్టేళ్లను వ్యాపారులు అమ్మకానికి పెట్టగా.. పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. భువనగిరి పట్టణంలో ఉదయం 8:30 గంటలకు ఈద్గాహ్ వద్ద నమాజ్ ఉంటుందని ముతవలీ అజీజ్ ఫారుక్ హుస్సేన్ తెలిపారు. గంజ్ మసీదు, ఖిల్లా మసీదులో ఉదయం 6గంటలకు, హన్మాపూర్ రైల్వే గేట్ వద్ద మసీదులో ఉదయం 7గంటలకు, రైల్వే స్టేషన్ మసీదులో 7:15కు, నూతన ఈద్గాహ్ చెరువు కట్ట వద్ద 7:30 గంటలకు ఉంటుందని ప్రత్యేక నమాజ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు.